హుడాకాంప్లెక్స్: భారతదేశ రాజకీయ సామాజిక చరిత్రలో దేశభక్తి విలువలకు కట్టుబడి ఉన్న మహనీయుడు డాక్టర్ రాంమనోహర్ లోహియా అని సీనియర్ జర్నలిస్టు, తెలంగాణ ఉద్యమకారుడు పాశం యాదగిరి అన్నారు. ఆయన ఆశయాలు, సిద్ధాంతాలకు అనుగుణంగా రాజకీయ పార్టీలు రావాలని ఆకాంక్షించారు. తెలంగాణ ఉద్యమ కారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు కాచం సత్యనారాయణ ఆధ్వర్యంలో సోమవారం కొత్తపేట చౌరస్తాలో డాక్టర్ రాంమనోహర్ లోహియా జయంతి వేడుకలు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా పాశం యాదగిరి మాట్లాడుతూ.. మహిళా విద్య, సామాజిక సమానత్వం, రాజకీయ స్వచ్ఛతపై రాంమనోహర్ లోహియా ఆలోచనలు అందరికీ స్ఫూర్తిదాయకం అన్నారు. కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య సమానత్వం తీసుకురావాలని లోహియా పోరాడారని గుర్తు చేశారు. గ్రామ స్వరాజ్యం రావాలన్నిది ఆయన కల అన్నారు. కాచం సత్యనారాయణ మాట్లాడుతూ.. లోహియా స్థాపించిన సోషలిస్టు పార్టీలో ఆయనకు ప్రధానమైన ఇద్దరు శిశ్యులు ములాయం యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు అయ్యారన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిలంచాలని సీఎం రేవంత్‌రెడ్డి తీసుకున్న నిర్ణయాలపై మాట్లాడుతున్న బీసీ నాయకులు రాంమనోహర్‌లోహియా ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగితే తెలంగాణ రాష్ట్రంలోనే కాక దేశంలో కూడా మొత్తం బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు. తెలంగాణ ఉద్యమంలో నాటి నుంచి నేటి వరకు తన వెంట ఉండి ముందు నడిపించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో భూదాన్ బోర్డు చైర్మన్ రాజేందర్‌రెడ్డి, టీయూసీసీ చైర్మన్ మురళీధర్‌దేశ్‌పాండె, పల్లె వినయ్‌కుమార్, బీరెల్లి వెంకటరెడ్డి, ఉప్పల శ్రవణ్‌కుమార్ దర్శన్, కూర రమేష్, శ్రీనివాస్, శైలజ, మధు, నర్సిరెడ్డి, శేఖర్, కోటి, మహేందర్, రాజుయాదవ్, తెలంగాణ ఉద్యమకారుల సంఘం నాయకులు, ఉద్యమకారులు, విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.


