సాక్షి, రంగారెడ్డిజిల్లా: కొహెడ పండ్ల మార్కెట్ భూములపై ప్రభుత్వ పెద్దల కన్నుపడింది. ఎలాంటి వివాదాలు లేని, ఇప్పటికే చదును చేసి ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఈ భూములను అగ్గువకే కొట్టేసేందుకు తెరవెనుక కుట్ర జరుగుతోంది. ఇందుకు తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ)ను కొత్తగా తెరపైకి తీసుకొచ్చింది. మార్కెటింగ్‌శాఖ చేతుల్లో ఉన్న ఈ భూములను టీజీఐఐసీకి బదిలీ చేయనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ప్రత్యామ్నాయంగా ఇదే రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 167/1లో 239 ఎకరాలను పండ్ల మార్కెట్‌కు కేటాయించనున్నట్లు వెల్లడించింది. చుట్టూ అనేక వివాదాలు, కొండలు, గుట్టలతో కూడిన ఈ భూములను కేటాయించడమంటే పండ్ల మార్కెట్ నిర్మాణ పనులను మరింత కాలం సాగతీయడమే అవుతుందని మార్కెటింగ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం చెబుతున్న ప్రత్యామ్నాయ భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇచ్చేది లేదని ఇప్పటికే పొజిషన్‌లో ఉన్న రైతులు స్పష్టం చేస్తున్నారు. పదిహేను రోజులుగా తమ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఒకవైపు రైతుల ఆందోళనలు.. మరోవైపు ప్రభుత్వ ప్రత్యామ్నాయ ప్రకటనల నేపథ్యంలో మార్కెట్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి.
కొత్తపేట నుంచి కొహెడకు..
నగరంలోని కొత్తపేటలో 22 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పండ్లమార్కెట్‌ను బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2021లో కొహెడకు తరలించింది. అప్పటికే సర్వే నంబర్ 507, 548లో 170 ఎకరాలు సేకరించి మార్కెటింగ్‌శాఖకు అప్పగించింది. ఎకరాకు రూ.7.44 లక్షల చొప్పున 44 మంది రైతులకు రూ.13 కోట్లు నష్టపరిహారం సైతం చెల్లించింది. అప్పట్లోనే రూ.20 లక్షలకుపైగా ఖర్చు చేసి ఇక్కడ తాత్కాలిక షెడ్లు వేసింది. ఈదురు గాలులతో కూడిన వర్షానికి ఆయా షెడ్లన్నీ నేలకూలి, మార్కెట్‌కు వచ్చిన మామిడికాయలు పూర్తిగా పాడయ్యాయి. ప్రత్యామ్నాయంగా బాటసింగారం ట్రక్ పార్కుకు మార్చారు. నెలకు రూ.66 లక్షల చొప్పున ఇప్పటి వరకు రూ.24 కోట్లకుపైగా అద్దె చెల్లించారు. గత ప్రభుత్వం మార్కెట్ నిర్మాణం కోసం రూ.450 కోట్లు మంజూరు చేసింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2,900 కోట్ల అంచనా వ్యయంతో 199 ఎకరాల్లో డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టును సిద్ధం చేసింది. పీపీఏ విధానంలో దేశంలోనే అతిపెద్ద మార్కెట్‌ను నిర్మించనున్నట్లు ప్రకటించింది. ఒకవైపు డీపీఆర్‌ను సిద్ధం చేసి.. మరోవైపు ఈ భూములను టీజీఐఐసీకి కేటాయిస్తూ కేబినెట్ ఇటీవల తీర్మా నం చేయడం చర్చనీయాంశమైంది.
ఆ భూమి చుట్టూ అనేక వివాదాలు
నిజానికి సర్వే నంబర్ 167/1లోని 239 ఎకరాలను నాటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం 2007లోనే రాజీవ్ గృహకల్ప పథకం కింద ఇంటి గ్రేటెడ్ టౌన్‌షిప్‌ల కోసం కేటాయించింది. మార్కెట్ ధర ప్రకారం గజానికి రూ.350 చొప్పున బదలాయించింది. అనంతరం హౌసింగ్‌బోర్డు ఈ భూములను దిల్ (దెక్కన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ల్యాండ్ హోల్డింగ్స్ లిమిటెడ్)కు అప్పగించింది. ఆ సంస్థ ఈ భూములను పట్టించుకోకపోవడంతో మళ్లీ ఇటీవల హౌసింగ్ బోర్డు స్వాధీనం చేసుకుంది. తమకు నష్టపరిహారం చెల్లించాలని అప్పట్లోనే రైతులు డిమాండ్ చేశారు. ఆయా భూముల్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టక పోవడంతో వాటిని రైతులే సాగు చేసుకుంటూ వస్తు న్నారు. ప్రభుత్వ తాజా ప్రకటనతో వారంతా ఆందోళన బాటపట్టారు. ఎట్టి పరిస్థితుల్లోనూ భూములను వదులుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నారు. ఎత్తుపల్లాలతో కూడిన ఈ భూమిలో మార్కెట్ నిర్మించాలంటే ప్రభుత్వం కూడా భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది. న్యాయపరమైన చిక్కులను సైతం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో కొహెడ పండ్ల మార్కెట్ పనులపై అనిశ్చితి నెలకొంది. పనులు ఎప్పుడు మొదలు పెడతారనే ప్రశ్నకు ఇటు మార్కెటింగ్‌శాఖ అధికారుల వద్ద కానీ, అటు ప్రభుత్వ పెద్దల వద్ద కానీ ఆశించిన సమాధానం లేదు. మార్కెట్ నిర్మించకుండా విలువైన ఈ భూములను పెద్దలకు కట్టబెట్టే కుట్ర జరుగుతోందనే ఆరోపణలు లేకపోలేదు.
వివాదం లేనివి టీజీఐఐసీకి బదలాయించే యత్నం
పండ్ల మార్కెట్‌కు ప్రత్యామ్నాయంగా మరోచోట కేటాయించనున్నట్లు ప్రకటన
ఏళ్లుగా పొజిషన్‌లో ఉన్న రైతులు
భూములు ఇచ్చేందుకు నిరాకరణ


