సీపీఎం జిల్లా కార్యదర్శి యాదయ్య
ఇబ్రహీంపట్నం: ప్రజా సమస్యల పరిష్కారానికి సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం చేపట్టే పాదయాత్రను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పి.యాదయ్య పిలుపునిచ్చారు. ఇబ్రహీంపట్నంలోని పాషనరహరి స్మారక కేంద్రంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కరించాలని నిర్వహించే ఈ పాదయాత్రను పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ఇబ్రహీంపట్నంలో ప్రారంభిస్తారని, కలెక్టరేట్ వరకు ఈ యాత్ర కొనసాగుతుందని తెలిపారు. అర్హులై వారందరికీ ఇంటి స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, భూ సమస్యలు ఎక్కడికక్కడ పరిష్కరించాలని, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు కొత్త పెన్షన్లు ఇవ్వాలని, ఉపాధి కూలీల సమస్యలు పరిష్కరించాలని తదితర డిమాండ్లతో పాదయాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి.జగదీశ్, కందుకూరి జగన్, మున్సిపల్ కార్యదర్శి ఎల్లేష్, నాయకులు నర్సింహ, విజయ్ పాల్గొన్నారు.


