చేవెళ్ల: పండించిన పంటలకు ధర లేకపోవటంతో ఓ రైతు మార్కెట్‌లోనే తన పంటను పారబోశాడు. కొత్తిమీర పంట కన్నీరు పెట్టిస్తోందని మండలంలోని కుమ్మెర గ్రామానికి చెందిన వీరేశం ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తనకు ఉన్న రెండు ఎకరాల్లో రూ.లక్ష ఖర్చు చేసి కొత్తిమీర పంటను సాగు చేశాడు. రెండు రోజులుగా రోజుకు వంద బాక్స్‌ల చొప్పున నగరంలోని గుడిమల్కాపూర్ మార్కెట్‌కు తరలించాడు. మార్కెట్‌లో ధరలు లేకపోవటంతో రూ.వందకు మూడు బాక్స్‌ల చొప్పున విక్రయిస్తున్నారు. ఆదివారం ఉదయం మార్కెట్‌కు వంద బాక్స్‌ల కొత్తిమీర తీసుకెళ్తే కొనే వారు లేకపోవటంతో పారబోసినట్లు తెలిపాడు. నిత్యం పొలంలో నుంచి వంద బాక్స్‌లు తీసేందుకు కూలీలకు, మార్కెట్‌కు తరలించేందుకు రవాణా ఖర్చులు అన్ని కలిపి రూ.10 వేలకు పైగానే అవుతున్నాయని, కనీసం దారి ఖర్చులు సైతం రాలేని దుస్థితి ఉందని వాపోయాడు. బాక్స్ ధర కనీసం రూ.200కు పైగా ఉంటేనే రైతులకు పెట్టుబడులైనా మిగులుతాయని పేర్కొన్నాడు.


