మున్సిపల్ చైర్‌పర్సన్ లావణ్య
కొత్తూరు: నిత్యం వ్యాయామం, యోగ సాధన చేసే వారు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని మున్సిపల్ చైర్‌పర్సన్ లావణ్య అన్నారు. ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆదివారం పట్టణంలో నిర్వహించిన 2కే రన్‌ను ఆమె ప్రారంభించారు. ఇందులో భాగంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ.. ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవనంలో ప్రజలు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించడం లేదన్నారు. దీంతో తరచూ అనారోగ్యాల బారిన పడి ఆస్పత్రుల్లో చేరుతున్నారన్నారు. నిత్యం యోగ, ఇతర వ్యాయామాలు సాధన చేస్తే ఆరోగ్యంగా ఉండొచ్చన్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న 90 రోజుల కార్యక్రమంలో పనులకే కాకుండా ఆరోగ్యం పట్ల కూడా ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో 2కే రన్‌ను నిర్వహించినట్లు స్పష్టం చేశారు. కార్యక్రమంలో కమిషనర్ బాలాజీ, కౌన్సిలర్లు కోస్గి శ్రీనివాస్, సోమ్లానాయక్, నాయకులు దేవేందర్‌ముదిరాజ్, నర్సింహ, ప్రవీణ్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
‘నవోదయ’లో రేయాన్ విద్యార్థుల ప్రతిభ
నాగోలు: జవహర్ నవోదయ ఫలితాల్లో నాగోలు బండ్లగూడలోని రేయాన్ కోచింగ్ సెంటర్ విద్యార్థులు జాతీయ ర్యాంకుతోపాటు పలు జిల్లా స్థాయి ర్యాంకులు సాధించారని ఆ సంస్థ అధినేత జి.జనార్దన్‌రెడ్డి తెలిపారు. ఆదివారం సెంటర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అరన్ దేవాన్ష్ ఆలిండియా మొదటి ర్యాంక్, పానుగంటి నవతేజ రంగారెడ్డిజిల్లా ఫస్ట్ ర్యాంకు, మెదక్ జిల్లాకు చెందిన డి.అమూల్య జిల్లాస్థాయిలో మూడో ర్యాంక్, ఖమ్మం జిల్లాకు చెందిన అయాన్ వేదిక్ జిల్లా స్థాయిలో నాలుగో ర్యాంక్, మహబూబ్‌నగర్‌కు చెందిన చెర్రీస్ జిల్లా స్థాయిలో ఏడో ర్యాంకు సాధించారని పేర్కొన్నారు. 26 ఏళ్లుగా నాణ్యమైన విద్య అందిస్తూ అనేకమంది విద్యార్థులను ఉన్నత స్థానాలకు తీసుకెళ్లినట్టు డైరెక్టర్లు జనార్థన్ రెడ్డి, ఉమారెడ్డి పేర్కొన్నారు.
కలప రవాణా చేస్తున్న వాహనం సీజ్
ధారూరు: అనుమతి లేకుండా కలపను తరలిస్తున్న వాహనాన్ని ఆదివారం అటవీ అధికారులు సీజ్ చేశారు. డిప్యూటీ ఫారెస్టు రేంజర్ హేమ తెలిపిన వివరాల ప్రకారం.. ధారూరు గ్రామానికి చెందిన కమ్మరి రమేశ్ తన వాహనంలో అక్రమంగా కలప తరలిస్తుండగా ప్రొటక్షన్ వాచర్స్‌తో కలిసి తనిఖీ చేశారు. ఎలాంటి అనుమతి లేకుండా దుంగలు రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. వాహనాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.
వ్యవసాయ బావుల వద్ద విద్యుత్ వైర్ల చోరీ
తాండూరు రూరల్: పెద్దేముల్ మండలం మంబాపూర్ గ్రామంలో పొలాల వద్ద బోరు మోటార్ల విద్యుత్ వైర్లను గుర్తు తెలియని దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుంది. రైతుల తెలిపిన ప్రకారం.. గ్రామ శివారులో రైతులు బోరు మోటార్ల కింద వరి సాగు చేస్తున్నారు. శనివారం రాత్రి వైర్లను దొంగిలించినట్లు గుర్తించిన రైతులు ఆదివారం పెద్దేముల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.


