చేవెళ్ల: రైతు సంక్షేమమే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి ముందుకు సాగుతున్నారని, ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ప్రారంభించారని మున్సిపల్ చైర్‌పర్సన్ దేవరి సమతావెంకట్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని రైతువేదిక వద్ద ఆదివారం సాయంత్రం సిద్దిపేట జిల్లాలో జరిగిన రైతుభరోసా నిధుల విడుదల, ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం, ఆయిల్‌పామ్ రిఫైనరీ పరిశ్రమకు శంకుస్థాపన కార్యక్రమాలు వ్యవసాయాధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు ప్రత్యేక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తోందన్నారు. రైతుల ఆదాయం పెంచేవిధంగా అయిల్‌పామ్ తోటలపై రాయితీలను అందిస్తూ వాటికి అనుగుణంగా మార్కెట్ సౌకర్యాలను కల్పించే ప్రయత్నాలు చేస్తోందన్నారు. రైతు భరోసా పథకం నిధులను చెప్పినట్లుగా రాష్ట్రవ్యాప్తంగా 22వ తేదీన రైతుల ఖాతాలో జమ చేసినట్లు తెలిపారు. అయితే రైతు వేదికలో జరిగిన ఈ కార్యక్రమంలో రైతులు మాత్రం కనిపించలేదు. కేవలం అధికారులు, ప్రజాప్రతినిధులే ప్రత్యక్ష ప్రసారాలను వీక్షించి వెళ్లిపోయారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ రాములుగౌడ్, కౌన్సిలర్ నర్సింలు, సర్పంచ్‌లు సింగప్పగూడ రవి, ఎన్కేపల్లి మహిపాల్‌రెడ్డి, రావులపల్లి రాంచంద్రయ్యగౌడ్, మండల వ్యవసాయాధికారి శంకర్‌లాల్, ఏఈఓలు మౌనిక, బాల కోటేశ్వర్‌రావు, ప్రతిభ తదితరులు పాల్గొన్నారు.


