యాచారం: గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు నిర్మాణానికి భూము లు ఇచ్చేది లేదని కుర్మిద్ద గిరిజన రైతులు స్పష్టం చేశారు. సాగు నేలలు ఇవ్వమని వారు చేస్తున్న దీక్ష శనివారానికి ఐదో రోజుకు చేరింది. దీక్షకు సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడు అంగోత్ రాంబాబు నాయక్, రాష్ట్ర కార్యదర్శి లక్‌పతి నాయక్‌లు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ప్రభుత్వం తక్షణమే రోడ్డు నిర్మాణ పనులు రద్దుచేయడంతో పాటు.. సాగు భూములను తీసుకోమని ప్రకటించాలని డిమాండ్ చేశారు. గిరిజన సంఘం నేతలు కిషన్‌నాయక్, రైతులు పాల్గొన్నారు.
విద్యుదాఘాతానికి గురై యువకుడి మృతి
పరిగి: విద్యుదాఘాతానికి గురైన ఓ యువకుడు మృతి చెందిన సంఘటన మున్సిపల్ పరిధిలోని రుక్కుంపల్లి గేట్ సమీపంలో శనివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ మోహనకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. దోమ మండలం బడెంపల్లితండాకు చెందిన మూడవత్ సురేశ్(28) కూలి పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. శుక్రవారం ఉదయం ఇంటి నుంచి పనికి వెళ్తానని చెప్పి బయలు దేరిన కుమారుడు విగత జీవిగా పడి ఉండటాన్ని చూసి అతడి తల్లిదండ్రుల రోదనల మిన్నంటాయి. వికారాబాద్‌లో లేబర్ పని ఉందని వెళ్లే క్రమంలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు మొక్కజొన్న పంటలోని వెళ్లగా.. పందుల బెడద నుంచి కాపాడేందుకు ఏర్పాటు చేసిన విద్యుత్ కంచెకు తగిలి మృతి చెందాడు. మృతుడి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రేమపెళ్లి చేసుకున్న దంపతులపై దాడి
● అన్న కూతురుతో పాటు ఆమె భర్తను గాయపర్చిన బాబాయి
● నవాబుపేట పీఎస్‌లో కేసు నమోదు
నవాబుపేట: తన అ న్న కూతురు ప్రేమ వివాహం చేసుకోవడాన్ని జీర్ణించుకోలేని ఓ వ్యక్తి దంపతులిద్దరిపైనా దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన గంగ్యాడ గ్రామంలో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కావలి శివకుమార్.. ఇదే ఊరికి చెందిన ఊర కురువ బుచ్చయ్య కూతురు స్వాతిని ప్రేమించి, గతేడాది జూన్ 24న పెళ్లి చేసుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత ఇరువురి తల్లిదండ్రులు అంగీకరించడంతో గ్రామంలోనే ఉంటున్నారు. ఉగాది పండుగ సందర్భంగా మూడు రోజుల క్రితం స్వాతి తల్లిగారి ఇంటికి వెళ్లింది. ఇది ఇష్టం లేని ఆమె బాబాయి కురువ పరమేశ్ బుధవారం ఉదయం స్వాతిపై చేయిచేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న శివకుమార్ వాళ్ల ఇంటికి వెళ్లి నా భార్యను ఎందుకు కొట్టావని నిలదీశాడు. దీంతో ఆగ్రహానికి గురైన పరమేశ్ కట్టెలు, రాళ్లతో దాడిచేసి శివకుమార్‌ను సైతం గాయపర్చాడు. బాధితుడి కుటుంబ సభ్యులు అతన్ని వికారాబాద్ ఆస్పత్రికి తరలించారు. గురువారం నవాబుపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పుండ్లిక్ తెలిపారు. ఇదిలా ఉండగా శివకుమార్‌కు తీవ్రగాయాలైనప్పటికీ ఆస్పత్రిలో పనిచేసే ఓ వైద్యుడు సాధారణ దెబ్బలే తగిలాయంటూ తప్పుడు మెడికల్ రిపోర్ట్ ఇచ్చాడని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలంటూ ఎమ్మెల్యే కాలె యాదయ్యను కలవగా ఆయన ఎస్పీకి ఫోన్ చేసి మాట్లాడారు. పూర్తి స్థాయి విచారణ జరిపి, న్యాయం జరిగేలా చూడాలని కోరారు.


