షాద్‌నగర్: పశుపోషణతో రైతులు అదనపు ఆదా యం ఆర్జించవచ్చునని పీవీ నర్సింహారావు తెలంగాణ పశువైద్య వర్సిటీ విస్తరణ సంచాలకులు డాక్టర్ కిషన్‌రావు అన్నారు. సోమవారం నందిగామ మండలం మేకగూడ, సంఘీగూడ, పిట్టలగూడ గ్రామాల్లో రాజేంద్రనగర్ పశువైద్య కళాశాల ఆధ్వర్యంలో భారత వ్యవసాయ పరిశోధన మండలి, నాట్కోపరిశ్రమ, సహకారంతో ఉచిత పశువైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రైతులకు పశుపోషణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రైతులకు మెరుగైన ఆదాయాన్ని అందించడంలో పశు సంపద కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ప్రభుత్వం రైతులకు సాంకేతిక, ఆర్థిక, నైతిక మద్దతును అందిస్తుందని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని, ప్రోత్సాహాన్ని రైతులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పాడి రైతులు విధిగా పశువైద్యుల సలహాలు, సూచనలు పాటించాలని అన్నారు. జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ.. మేకగూడలో చాలా మంది రైతులు పాడిపరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారని అన్నారు. సరైన పోషణ పద్దతులు, పశు ఉత్పత్తుల నిర్వాహణలో అవగాహన లేక ఆఽశించిన స్ధాయిలో లాభాలను పొందలేకపోతున్నారని అన్నారు. ఈ సందర్బంగా ఆయా గ్రామాల్లో 158 పశువులకు ఉచిత వైద్య సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ పశువైద్య కళాశాల డీన్ డాక్టర్ మాధురి, డాక్టర్ విష్ణువర్ధన్, సర్పంచ్‌లు మారు రాజు నాయక్, కొమ్ము కృష్ణ, పాల్గొన్నారు.
పీవీ నర్సింహారావు పశువైద్య వర్సిటీ వీసీ డాక్టర్ కిషన్‌రావు


