సర్కిల్– 16 ఆఫీసులో అవినీతి నిరోధక శాఖ తనిఖీలు టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ సెక్షన్లలోని ఫైళ్ల పరిశీలన అక్రమాలపై కొనసాగినసుదీర్ఘ విచారణ
బడంగ్‌పేట్: బడంగ్‌పేట సర్కిల్– 16 కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ గంగసాని శ్రీధర్ నేతృత్వంలో 15 మందితో కూడిన బృందం కార్యాలయానికి చేరుకుని సోదాలు మొదలుపెట్టింది. ముందుగా డీసీ సరస్వతి చాంబర్‌లోకి వెళ్లి విచారణ ప్రారంభించింది. అనంతరం డీఈ వెంకన్న, మేనేజర్ శ్రీధర్‌రెడ్డిని పిలిపించిన అధికారులు అదే చాంబర్‌లో విచారణ చేపట్టారు. ఏసీబీ టీం వచ్చిందనే సమాచారం తెలియగానే టౌన్‌ప్లానింగ్ చాంబర్‌లో ఉన్న ఏసీపీ కిరణ్‌కుమార్ అక్కడినుంచి వెళ్లిపోయి, ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్నారు. కొద్దిసేపటి తర్వాత అతన్ని పిలిపించి టౌన్‌ప్లానింగ్ సెక్షన్‌లో విచారణ చేశారు. డీసీ, డీఈ చాంబర్, ఏఈ సెక్షన్లలో రాత్రి 11 గంటల వరకు సుదీర్ఘ విచారణ కొనసాగింది. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీధర్ విలేకరులతో మాట్లాడుతూ.. బడంగ్‌పేట కార్పొరేషన్‌లో పలు ఫైళ్లు తారుమారు చేశారని, ఈ వ్యవహారంలో పెద్దఎత్తున (రూ.30 కోట్ల) అవినీతి జరిగిందని పలు పత్రికలు, టీవీ చానళ్లతో పాటు నేరుగా ఫిర్యాదులు అందడంతో ఎంకై ్వరీకి వచ్చామన్నారు. శివారు కార్పొరేషన్లు జీహెచ్‌ఎంసీలో విలీనం కాకముందు, విలీన సమయంలో చేపట్టిన పనులు, ఇచ్చిన అనుమతులపై ఆరా తీశారు. విలీన సమయంలో పనులు చేయకుండానే బిల్లులు ఇవ్వడం, కొన్ని బిల్లులు మైనస్‌లో పెట్టి, బిల్లులు ఇవ్వాలని తిరిగి జీహెచ్‌ఎంసీకి పంపించడంతో పాటు టౌన్‌ప్లానింగ్ నుంచి ఇచ్చిన పర్మిషన్ల వివరాలను నమోదు చేసుకున్నారు. అక్రమాలు జరిగినట్లు తేలితే కేసులు నమోదు చేస్తామని, కేసు నమోదైతే సదరు అధికారులు సస్పెండ్ అయినట్లేనని తెలిపారు. ప్రతీ ఫైల్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తామన్నారు. ఇదిలా ఉండగా బడంగ్‌పేట సర్కిల్ అధికారుల అవినీతి గుట్టు బయటిపెట్టి, దొంగల భరతం పట్టాలని విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదులు వెళ్లినా పట్టించుకోకపోవడంలో ఆంతర్యం ఏమిటోనని స్థానికంగా చర్చ సాగుతోంది. ఈనేపథ్యంలో విజిలెన్స్ పనితీరుపై సైతం ఏసీబీ దృష్టిసారించిందని, ఈ విషయంలోనూ లోతైన విచారణ చేస్తోందని సమాచారం.


