ఈ 20 రోజులే కీలకం | - | Sakshi
Sakshi News home page

ఈ 20 రోజులే కీలకం

Feb 21 2026 8:53 AM | Updated on Feb 21 2026 8:53 AM

ఈ 20

ఈ 20 రోజులే కీలకం

వికారాబాద్‌ జిల్లాలో 13,248 మంది టెన్త్‌ విద్యార్థులు నవంబర్‌ నుంచే ప్రత్యేక తరగతులు ప్రారంభించాం అభ్యాస దీపికలు అందజేశాం పరీక్షలకు అన్ని విధాలా సన్నద్ధం చేశాం ‘సాక్షి’తో జిల్లా విద్యాధికారి రేణుకాదేవి

‘పది’లో మెరుగైన ఫలితాలే లక్ష్యంగా కార్యాచరణ

వికారాబాద్‌: ‘పదో తరగతిలో మెరుగైన ఫలితాలే లక్ష్యంగా టీంవర్క్‌ చేస్తున్నాం.. ఇందుకోసం అన్ని చర్యలు తీసుకుంటున్నాం.. విద్యార్థులు భయం లేకుండా నేర్చుకున్నది పరీక్షల్లో రాసేలా సంసిద్ధులను చేస్తున్నాం..’ అని డీఈఓ రేణుకాదేవి అన్నారు. మార్చి 14వ తేదీ నుంచి టెన్త్‌ ఎగ్జామ్స్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉత్తమ ఫలితాల కోసం విద్యాశాఖ చేస్తున్న కసరత్తు.. తీసుకుంటున్న చర్యలను ఆమె ‘సాక్షి’కి వివరించారు. డీఈఓ మాటల్లో.. పరీక్షలకు మూడు నెలల సమయం ఉన్నప్పటి నుంచే ప్రత్యేక కార్యాచరణ మొదలు పెట్టాం. ప్రత్యేక తరగతులు, చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించడం.. వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం వంటివి ప్రారంభించాం. మరో 20 రోజుల సమయం మాత్రమే ఉన్నందున మరింత శ్రద్ధ వహిస్తున్నాం. విద్యార్థులకు కూడా ఈ సమయం అత్యంత కీలకం.

గత ఫలితాలు నిరాశ పరిచాయి

కరోనా కంటే ముందు పది ఫలితాల్లో జిల్లా 27వ స్థానంలో ఉండేది. ఆ తర్వాత ఏడాది బాగా కష్టపడటంతో 24వ స్థానానికి చేరుకున్నాం. రెండేళ్ల నుంచి ఫలితాలు నిరాశ పరిచాయి. ఈ పరిస్థితి పునరావృతం కారాదని, శత శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా ఈ ఏడాది నవంబర్‌ నుంచే ప్రత్యేక తరగతులు ప్రారంభించాం. కలెక్టర్‌ హెచ్‌ఎంలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి సూచనలు సలహాలు ఇచ్చారు. జిల్లాలో మొత్తం 13,248 మంది పదో తరగతి విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందులో 10,328 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కాగా.. 2,920 మంది ప్రైవేట్‌ స్కూల్స్‌లో చదువుతున్నారు.

ప్రత్యేక ఏర్పాట్లు చేశాం

పదో తరగతి విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధంచేసే విషయంలో ఈ సారి ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. గతేడాది ఉదయం స్నాక్స్‌ లేక విద్యార్థులుఇబ్బందులు పడ్డారు. ఈ సారి ప్రభుత్వమే స్నాక్స్‌ కోసం నిధులు సమకూర్చింది. ఒంటిపూట బడుల సమయంలో కూడా స్పెషల్‌ క్లాసులు తీసుకునేలా చర్య లు తీసుకుంటాం. ఇందుకోసం ప్రతి పాఠశాలలో రోజూ ఇద్దరు ఉపాధ్యాయులు ఉండేలా హెచ్‌ఎంలను ఆదేశించాం. ఈ సారి విద్యార్థులు సులభంగా చదువుకునేందుకు ప్రభుత్వం అభ్యసన దీపికలు అందజేసింది. వాటి ద్వారా కూడా ప్రిపేర్‌ చేస్తున్నాం. ప్రీ ఫైనల్స్‌ పక్కాగా నిర్వహిస్తున్నాం.. ఒక రోజు ఎగ్జామ్‌ పెట్టి మరో రోజు వారు రాసిన పరీక్ష పేపర్లపైన ఉపాధ్యాయులు చర్చించేలా ప్లాన్‌ చేస్తున్నాం. అందులో ఏమైన లోపాలు ఉంటే వారికి అర్థమయ్యేలా ఉపాధ్యాయులు చెబుతారు. విద్యార్థుల సామర్థ్యాలను బట్టి గ్రూపులుగా విభజించి బోధన చేస్తున్నాం. ప్రతి పరీక్షకు మధ్యలో మూడు రోజుల వ్యవధి ఉన్నందున ఆ సమయంలో వినియోగించుకునేందుకు ప్లాన్‌ చేస్తున్నాం. విద్యార్థులను స్కూళ్లకు రప్పించి మరోసారి రివిజన్‌ చేస్తాం.

వేకప్‌ కాల్స్‌ చేస్తున్నాం

విద్యార్థులకు చదువు చెప్పడంతో సరిపెట్టకుండా ఉదయం 5గంటలకే వేకప్‌ కాల్స్‌ చేస్తున్నాం. తల్లిదండ్రులతో తరచూ మాట్లాడాలని ఉపాధ్యాయులకు సూచించాం. పేరెంట్‌.. టీచర్‌ మీటింగ్స్‌ నిర్వహిస్తున్నాం. పిల్లల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నాం. చదువులో వెనుకబడిన వారిని, నిర్లక్ష్యంగా వ్యవహరించే విద్యార్థులు ఉంటే వారి ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులతో చర్చిస్తున్నాం. హెచ్‌ఎంలు, ఎంఈఓలతో వాట్సప్‌ గ్రూపులు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. నేరుగా ఫోన్‌లో మాట్లాడుతున్నా.. ప్రధానోపాధ్యాయులతో తరచూ సమావేశాలు ఏర్పాటు చేసి సలహాలు సూచనలు ఇస్తున్నాం. స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఖాళీగా ఉన్న స్థానాల్లో సబ్జెక్టు తెలిసిన ఎస్జీటీలతో పాఠాలు చెప్పిస్తున్నాం. టీంవర్క్‌ చేసి మంచి ఫలితాలు సాధించేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నాం. ఈ సారి మంచి రిజల్ట్‌ వస్తుందని నమ్మకం ఉంది. విద్యార్థులు కూడా ఉన్న కొద్దిపాటి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

ఈ 20 రోజులే కీలకం 1
1/1

ఈ 20 రోజులే కీలకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement