పంజగుట్ట: విద్యార్థుల అభిరుచికి అనుగుణంగా భాషా బోధన అందించాలి తప్ప బలవంతంగా పరభాషను రుద్దాలనే ప్రయత్నాన్ని చేయరాదని రౌండ్ టేబుల్ సమావేశంలోని వక్తలు అభిప్రాయపడ్డారు. శుక్రవారం హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ లో ‘నూతన విద్యా పాలసీ– పర్యవసానాలు’ అనే అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ప్రొఫెసర్ లక్ష్మణ్ , ప్రొఫెసర్ వినాయక రెడ్డిల అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు కే కేశవరావు మాట్లాడుతూ.. గత కొంతకాలం క్రితం విద్యా కమిషన్ ఇచ్చిన ఎడ్యుకేషన్ పాలసీ కేవలం నివేదిక మాత్రమే అని, దీనిపై ఇంకా కసరత్తు జరగాల్సిన అవసరం ఉందన్నారు. 20 రోజులలో వెబ్‌సైట్ లో ఉంచుతామని, తదనంతరం వచ్చే సలహాలు సూచనలు స్వీకరించి మార్పులు చేర్పులు చేసిన తర్వాత తుది రూపు ఇచ్చి ప్రభుత్వానికి అందిస్తామన్నారు. దీనిపై ఉపాధ్యాయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జీతాల పెరుగుదల ఉంటుంది తప్ప తగ్గించే ప్రసక్తే ఉండదని స్పష్టం చేశారు. ముగ్గురు వైస్ చాన్సలర్లతో పాటు, ఉపాధ్యాయ సంఘాలు, ఎన్జీవోలు, విద్యార్థి సంఘాలతో త్వరలో సమావేశం నిర్వహిస్తామన్నారు. మాజీ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ.. విద్య వైద్యం విషయంలో ప్రభుత్వాలు బడ్జెట్లో పెద్దపీట వేసినప్పుడే సామాన్య ప్రజలకు అవి అందుబాటులోకి వస్తాయన్నారు. నీటిపారుదల శాఖ మాజీ చైర్మన్ వి ప్రకాష్ మాట్లాడుతూ ప్రభుత్వం వేసిన విద్యా కమిషన్ కి ప్రత్యామ్నాయంగా పీపుల్స్ కమిషన్ ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందరన్నారు. కార్యక్రమంలో లెక్చరర్ల సంఘం నాయకులు మధుసూదన్ రెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా సలహాదారులు ఉపేందర్ రెడ్డి, జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్, పాల్గొన్నారు.
రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు


