రెండు ఆలయాల్లో హుండీలు చోరీ
షాద్‌నగర్‌రూరల్: ఆలయాల్లో ఏర్పాటు చేసిన హుండీలను గుర్తు తెలియని దుండగులు గురువారం అర్ధరాత్రి ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన మండల పరిధిలోని కడియాలకుంట తండాలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. తండాలోని సేవాలాల్ మహరాజ్ ఆలయం, బూరుగడ్డ తండాలోని ఆంజనేయ స్వామి ఆలయంలోని హుండీలను దుండగులు ఎత్తుకెళ్లారు. కానుకలను అపహరించి హుండీలను సమీప పొలాల్లో పడేశారు. ఈ మేరకు సర్పంచ్ రాజునాయక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్రైమ్ ఎస్‌ఐ శివారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
శంషాబాద్ రూరల్: కుటుంబ సభ్యులు జాతరకు వెళ్లగా.. ఇంటి నుంచి బాలిక అదృశ్యమైన ఘటన రషీద్‌గూడలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ కె.నరేందర్‌రెడ్డి సమాచారం మేరకు... వనపర్తి జిల్లా వీపనగండ్ల నివాసి ఆలె ఆశన్న తన కుటుంబంతో కలిసి నాలుగేళ్ల కిందట వలస వచ్చి రషీద్‌గూడలో నివాసం ఉంటున్నాడు. ఈ నెల 19న భార్య, కొడుకుతో కలిసి ఆశన్న కొల్లాపూర్‌లోని ఈదమ్మ జాతరకు వెళ్లారు. ఈ సమయంలో వారి కూతురు సింధు ఇంట్లోనే ఉంది. ఈమె పట్టణంలోని ఓ కళాశాలలో ద్వితీయ సంవత్సరం ఇంటర్మీడియట్ చదువుకుంటుంది. కుటుంబ సభ్యులు జాతర నుంచి అదే రోజు ఇంటికి వచ్చి చూడగా.. సింధు ఇంట్లో కనిపించలేదు. ఇంట్లో నుంచి దుస్తులు, స్టడీ సరిఫికెట్లు కూడా లేవు. ఆమె కోసం అన్ని చోట్ల వెతికినా ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు శుక్రవారం పొలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శంషాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పెండింగ్ కేసులపై
ప్రత్యేక దృష్టి
ఎస్పీ స్నేహ మెహ్ర
అనంతగిరి: పెండింగ్ కేసుల్లో పురోగతి సాధించాలని ఎస్పీ స్నేహ మెహ్ర ఆదేశించారు. శుక్రవారం వికారాబాద్‌లోని జిల్లా కార్యాలయంలో పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా స్టేషన్ల వారీగా పెండింగ్ కేసులపై ఆరా తీశారు. దర్యాప్తును వేగవంతంగా చేసి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. నేరాల నియంత్రణపై దృష్టి సారించాలని ఆదేశించారు. రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని తెలిపారు. ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాలన్నారు. గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో సమర్థవంతంగా విధులు నిర్వహించడంపై పోలీస్ అధికారులను అభినందించారు. భవిష్యత్‌లో కూడా ఇదే టీమ్ వర్క్‌గా పని చేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరారు.
రెండు ఆలయాల్లో హుండీలు చోరీ


