రోహిత్‌రెడ్డికి బెయిల్ మంజూరు
మరో 8 మంది బీఆర్‌ఎస్ నాయకులకు సైతం
తాండూరు: మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద కోడ్ ఉల్లంఘించిన కేసులో తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి తోపాటు మరో 8 మంది బీఆర్‌ఎస్ నాయకులకు శుక్రవారం హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల 13న తాండూరు పట్టణంలోని సెయింట్ మార్కస్ స్కూల్‌లో ఓట్ల లెక్కింపు జరిగింది. సాయంత్రం 5 గంటల తర్వాత పలు వార్డుల ఫలితాలు ఆలస్యం కావడంతో ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లారు, దీంతో మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి సైతం వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పట్టణ సీఐ సంతోష్, పోలీసు అధికారులకు బీఆర్‌ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రోహిత్‌రెడ్డి పోలీసు ఽఅధికారులపై అనుచితంగా ప్రవర్తించారని, ఎన్నికల నిబంధనలు ఉల్లంగించారంటూ పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అరెస్టు చేస్తారనే అనుమానంతో మాజీ ఎమ్మెల్యే తోపాటు మరో 8 మంది బీఆర్‌ఎస్ నాయకులు అజ్ఞాతంలోకి వెళ్లారు. రోహిత్‌రెడ్డి తరఫు న్యాయవాదులు హైకోర్టులో 5 రోజుల క్రితం బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. శుక్రవారం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో పైలెట్ అజ్ఞాతం వీడారు. నేడో.. రేపో తాండూరుకు వచ్చే అవకాశం ఉందని బీఆర్‌ఎస్ నాయకులు తెలిపారు.


