మలుపులు..యమపురికి పిలుపు..!
శంషాబాద్–షాబాద్ రహదారిపై పొంచి ఉన్న ప్రమాదాలు
శంషాబాద్ రూరల్: మండల పరిధిలోని శంషాబాద్–షాబాద్ రహదారి ప్రమాదాలకు నిలయంగా మారుతోంది. ఓవైపు మలుపులు, మరోవైపు హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో వాహనదారులు బిక్కుబిక్కుమంటూ రాకపోకలు సాగిస్తున్నారు. ముఖ్యంగా నర్కూడ నుంచి రామంజాపూర్ వరకు రెండు వరసల రహదారిలోని మలుపుల వద్ద తరచూ ప్రమాదాలు జరిగి పలువురు గాయపడినా.. అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కానరాని సూచిక బోర్డులు..
రహదారిలోని ప్రమాదకర ప్రాంతాల్లో సూచిక, హెచ్చరిక బోర్డులు లేవు. దీంతో కొత్తగా ఈ దారిగుండా ప్రయాణించే వారికి ఎక్కడ మలుపు తిరుగుతుందో తెలిసేలోపే ఎదురుగా వచ్చే వాహనాలపైకి దూసుకుపోయే పరిస్థితి నెలకొన్నది. వర్ధమాన్ ఇంజినీరింగ్ కళాశాల సమీపం, కాచారం, రాయన్నగూడ, రామంజాపూర్ శివారుల్లోని మలుపుల వద్ద గతంలో ట్రాఫిక్ పోలీసులు ప్లాస్టిక్ డైలెనేటర్లను ఏర్పాటు చేశారు. అయితే వాహనాలు వాటిని ఢీకొని ధ్వంసమయ్యాయి. అయినా వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయలేదు.
శిథిలావస్థలో వంతెన..
ఎంటేరువాగుపై కాచారం వద్ద వంతెన శిథిలావస్థకు చేరింది. వర్షాకాలంలో భారీగా వరదలు వస్తే బ్రిడ్జిని తాకుతూ ప్రవహిస్తాయి. నిత్యం వేల సంఖ్యలో వాహనాలు, భారీ వాహనాల రాకపోకలతో ఏళ్ల నాటి వంతెనపై భారం పెరిగి ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు వంతెనకు ఇరువైపులా రక్షణ దిమ్మెలు కూలిపోయాయి. ఇటీవలే ఇక్కడ భారీ ప్రమాదం జరగగా తృటిలో ప్రాణాపాయం తప్పింది.
అడుగడుగునా గుంతలు..
నర్కూడ గ్రామంలో రహదారిపై సుమారు అర కిలోమీటరు వరకు అడుగడుగునా గుంతలే దర్శనమిస్తున్నాయి. రోడ్డుకిరువైపులా గ్రామం విస్తరించి ఉండడంతో మురుగునీరు, తాగునీటి పైపుల కోసం రోడ్డును ఇష్టానుసారంగా తవ్వేశారు. తారురోడ్డుపై వరద నిలిచి గుంతలు ఏర్పడ్డాయి. ఆర్‌అండ్‌బీ అధికారులు రోడ్డు మరమ్మతులు చేపట్టకపోవడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడంలేదు. కాచారం బస్టాప్ వద్ద సైతం రహదారిపై భారీ గుంత పడింది. దీంతో వాహనదారులు, బస్టాప్ వద్ద ప్రయాణికులు చాలా అవస్థలు పడుతున్నారు. కొన్ని రోజుల కిందట మట్టితో గుంతను పూడ్చినా.. ఎగుడుదిగుడుగా ఉండడంతో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు.
రోడ్డు విస్తరణ చేపట్టాలి
శంషాబాద్ నుంచి నర్కూడ శివారు వరకు మాత్రమే రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. దీంతో మిగితా రోడ్డంతా ఇరుకుగా మారి ప్రమాదాలు జరుగుతున్నాయి. శంషాబాద్–షాబాద్ వరకు కూడా పూర్తి చేస్తే వాహనదారులకు ఇబ్బందులు తప్పుతాయి. ఆ దిశగా అధికారులు సత్వరమే చర్యలు తీసుకోవాలి.
–మహేశ్‌కుమార్, రామంజాపూర్
గుంతలు పూడ్చాలి
రోడ్డుపై ప్రమాదకరంగా ఉన్న గుంతలను వెంటనే పూడ్చి వేయాలి. అలాగే మలుపుల వద్ద రోడ్డును విస్తరిస్తే ప్రమాదాలను నివారించవచ్చు. మరోవైపు రోడ్డు పక్కనే ఏపుగా పెరిగిన చెట్ల కొమ్మలు, విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించి అక్కడే వదిలేస్తున్నారు. దీంతో ప్రమాదాలకు కారణమవుతున్నాయి. వెంటనే వాటిని తొలగించాలి.
–సంతోష్, ననాజీపూర్
ప్రమాదకర టర్నింగ్ పాయింట్లు, కనిపించని హెచ్చరిక బోర్డులు శిథిలావస్థకు చేరిన ఎంటేరువాగు వంతెన, రక్షణ దిమ్మెలు ధ్వంసం బిక్కుబిక్కుమంటూ వాహనదారుల రాకపోకలు, పట్టని అధికారులు


