భూ నిర్వాసితులను ఆదుకుంటాం
● కందుకూరు ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి
● నాగిరెడ్డిపల్లి రైతులకు
రూ.2.21 కోట్ల పరిహారం
మహేశ్వరం: భూ నిర్వాసితులకు ప్రభుత్వం పరిహారం అందజేసి అన్ని విధాలుగా ఆదుకుంటుందని కందుకూరు ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి అన్నారు. ఐటీ పార్కు ఏర్పాటులో భూములు కోల్పోతున్న నాగిరెడ్డిపల్లికి చెందిన 15 మంది భూ నిర్వాసితులకు బుధవారం 24.30 ఎకరాలకు సంబంధించి రూ.22.21 కోట్ల పరిహారం చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ.. ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వం రైతుల నుంచి అసైన్డ్, సీలింగ్, పట్టా భూములను తీసుకుంటుంన్నారు. ప్రభుత్వం టీజీఐఐసీకి అప్పగించడంతో వారు పరిశ్రమలు ఏర్పాటు చేసి ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పాటు అందించడంతో పాటు స్థానిక నిరుద్యోగ యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తుందన్నారు. భూములు కోల్పోయిన రైతులకు 2013 చట్టం ప్రకారం మూడింతల పరిహారం ఇవ్వాలని ఉనప్పటికీ అంతకు మించి పరిహారం ఇచ్చి రైతులను ఆదుకుంటున్నామని తెలిపారు. నాగిరెడ్డిపల్లిలో భూ నిర్వాసితులకు ఎకరాకు రూ.1.20 కోట్ల పరిహారం, హెచ్‌ఎండీఏ నిబంధనల ప్రకారం 121 గజాల ఓపెన్ ప్లాట్‌ను పరిహారం కింద ఇస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు 17 మంది రైతులు అంగీకార పత్రాలు ఇచ్చారని, మిగిలిన రైతులు అంగీకార పత్రాలు ఇస్తే పరిశీలించి వారి పేరిట చెక్కుల రూపంలో పరిహారం అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాగిరెడ్డిపల్లి సర్పంచ్ బామిని నాయక్, ఉప సర్పంచ్ జగన్, పడమటి తండా సర్పంచ్ వినోద్ నాయక్, ఎంపీటీసీ మాజీ సభ్యుడు రమేశ్, మాజీ సర్పంచ్ రాములు నాయక్, మాజీ ఉప సర్పంచ్ దేవులానాయక్, ఐఎన్‌టీయూసీ నియోజకవర్గ అధ్యక్షుడు శివ, కుమార్, మాధవులు, రైతులు వనజ, దేవేందర్ నాయక్, రాములమ్మ, బాల్‌రాజ్, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.


