‘పాలమూరు’ చారిత్రక అవసరం | - | Sakshi
Sakshi News home page

‘పాలమూరు’ చారిత్రక అవసరం

Feb 19 2026 11:02 AM | Updated on Feb 19 2026 11:02 AM

‘పాలమూరు’ చారిత్రక అవసరం

‘పాలమూరు’ చారిత్రక అవసరం

లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ వెంటనే పూర్తి చేయాలి

ప్రొఫెసర్‌ హరగోపాల్‌

షాద్‌నగర్‌రూరల్‌: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని చారిత్రాత్మక అవసరంగా గుర్తించి లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని ప్రొఫెసర్‌ హరగోపాల్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనంలో పాలమూరు అధ్యయన వేదిక, ప్రజాసంఘాల సంయుక్త ఆధ్వర్యంలో లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ నిర్మాణం ఎందుకు చేపట్టలేదు, జలవనరుల కల్పనలో అసమానతలు–పర్యవసానాలు అనే అంశంపై సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా ప్రొఫెసర్‌ హరగోపాల్‌ హాజరై మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన సమయంలో పాలమూరు కరువు, నల్గొండ ఫ్లోరోసిస్‌ సమస్యలపై అన్ని వేదికలపై మాట్లాడామని గుర్తు చేశారు. పాలమూరు జిల్లా కరువు జిల్లా, వలసల జిల్లాఅని, వలసలతో ప్రజలు దుర్భరజీవితాలను అనుభవిస్తున్నారని, ఇవన్నీ పోవాలంటే సాగునీరు అందించాలని ఆనాడు చెప్పామన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాడ్డాక అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం తెలంగాణ ప్రాంత ప్రజల కష్టాలను పట్టించుకోలేదని ఆరోపించారు. ఉద్యమకారులు ఆకాంక్షించిన ఉచిత విద్య, నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో పాలమూరు–రంగారెడ్డి జిల్లాకు తీరని అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. పాలమూరు, రంగారెడ్డి జిల్లాలకు చెందిన రాజకీయ నాయకులు విలువలతో కూడిన రాజకీయాలు చేసిఉంటే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఎప్పుడో న్యాయం జరిగి ఉండేదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. నీటి విలువ నల్గొండ జిల్లా ప్రజాప్రతినిధులకు బాగా తెలుసునని, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుతో ఇప్పటికే సస్యశ్యామలమైన నల్గొండ జిల్లాకు ఆ జిల్లా ప్రజాప్రతినిధులు పాలమూరు జిల్లాలోని డిండిలో రిజర్వాయర్‌ను కట్టి నల్గొండకు నీటిని తరలించుకుపోతున్నారని అన్నారు. రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు గడుస్తున్నా నేటికీ పాలమూరులో వలసలు ఆగలేదని అన్నారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగమైన లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌కు ప్రజాప్రతినిధులే పెద్ద సమస్యగా మరారని విమర్శించారు. ఇప్పటికై నా ప్రభుత్వం వెంటనే లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ను పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాస్త్రవేత్త నర్సింహారెడ్డి, పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్‌ రాఘవాచారి, రవీంద్రనాథ్‌, తిరుమలయ్య, టీజీ.శ్రీనివాస్‌, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement