పరిపూర్ణ హస్తమంత్రం | - | Sakshi
Sakshi News home page

పరిపూర్ణ హస్తమంత్రం

Feb 19 2026 11:02 AM | Updated on Feb 19 2026 11:02 AM

పరిపూర్ణ హస్తమంత్రం

పరిపూర్ణ హస్తమంత్రం

● పార్టీ జిల్లా అధ్యక్షులకు పది రోజల శిక్షణ ● హరిత రిసార్ట్స్‌ వేదికగా ట్రైనింగ్‌ ● పాల్గొననున్న ఉమ్మడి ఏపీ డీసీసీ ప్రసిడెంట్లు

సుశిక్షితులైన డీడీసీల తయారీకి కాంగ్రెస్‌ సన్నద్ధం

వికారాబాద్‌: పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు కాంగ్రెస్‌ అధిష్టానం సిద్ధమైంది. ఇందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా ఎన్నికై న డీసీసీలకు శిక్షణ ఇవ్వనుంది. జిల్లా కేంద్రానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రముఖ పర్యాటక కేంద్రమైన అనంతగిరి గుట్టపై గల హరిత రిసార్ట్స్‌లో ఈ నెల 21 నుంచి ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. జిల్లా బాధ్యులకు నైపుణ్యాలను అందించటం ద్వారా పూర్తి స్థాయి లీడర్లను తయారు చేయాలన్నదే పార్టీ లక్ష్యంగా కనిపిస్తోంది. ఇప్పటికే రిసార్ట్‌ను సందర్శించిన నిర్వహణ కమిటీ ప్రతినిధులు ఏర్పాట్లను వేగవంతం చేశారు. ఇటీవల జిల్లా నేతలతో కలిసి కాంగ్రెస్‌ తెలంగాణ ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌ రిసార్ట్‌ను సందర్శించి, పలు సూచనలు చేశారు.

విధులు, బాధ్యతలపై..

కార్యక్రమంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి, డీసీసీల విధులు, బాధ్యతలు, పార్టీ బలోపేతం వంటి అంశాలపై పది రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. ఏపీ, తెలంగాణకు చెందిన అన్ని జిల్లాల అధ్యక్షులతో పాటు పార్టీకి చెందిన ముఖ్య నేతలు హాజరుకానున్న నేపథ్యంలో కార్యక్రమ నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకుని, ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా చూస్తున్నారు. హరిత రిసార్ట్స్‌లో 36 గదులు ఉండగా అన్నింటినీ బుక్‌ చేసుకుని, డీసీసీలు, అతిథులకు కేటాయించారు. తరగతుల నిర్వహణకు ఆడిటోరియం హాల్‌ను వినియోగించనున్నారు. వీరికి భోజన, పార్కింగ్‌ ఏర్పాట్లు, సెక్యూరిటీ తదితర అంశాలను పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి చూసుకుంటున్నారు. తెలంగాణలో అధికారం ఉన్న కారణంగానే ట్రైనింగ్‌ సెంటర్‌ను ఇక్కడ ఎంచుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌కు సమీపంలో ఉండటం, ఆహ్లాదకరమైన వాతావరణం నేపథ్యంలో అనంతగిరిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

సంఘటన్‌ సృజన్‌ అభియాన్‌ ఆధారంగా..

గతంలో ఎప్పుడూ లేని విధంగా కాంగ్రెస్‌ పార్టీ ఈసారి డీసీసీ అధ్యక్షుల ఎంపిక ప్రక్రియను గత సంప్రదాయానికి విరుద్ధంగా వినూత్నంగా నిర్వహించింది. ఏఐసీసీ ఏర్పాటు చేసిన సంఘటన్‌ సృజన్‌ అభియాన్‌ అబ్జర్వర్ల బృందం రాష్ట్రంలోని అన్ని జిల్లాలను పర్యటించి పార్టీకి చెందిన అన్ని వర్గాల అభిప్రాయాలను సేకరించింది. పార్టీ నేతల సిఫారసులను పక్కన పెట్టి కమిటీ క్షేత్ర స్థాయి సమాచారం ఆధారంగా జిల్లా అధ్యక్షులను ఎంపిక చేసింది. పార్టీని క్షేత్రస్థాయి నుంచి పటిష్టం చేయటంలో భాగంగానే ఈ విధానాన్ని అవలంబించినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ శిక్షణ తరగతులు సైతం సంఘటన్‌ సృజన్‌ అభియాన్‌ విధివిధానాల ప్రకారమే నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సచిన్‌ శిక్షణ ఇవ్వనున్నారు. ఈ నెల 21నుంచి మార్చి 2వ తేదీ వరకు క్లాసులు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఆడిటోరియంలో నిర్వహించే శిక్షణ తరగతులతో పాటు ఫీల్డ్‌ విజిట్‌ కూడా చేయనున్నారు. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించి ఉపాధిహామీ పనులను స్వయంగా పరిశీలించనున్నారు. ఇందుకు సంబంధించిన పనులు చకచగా సాగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement