కాంగ్రెస్‌ది ప్రతీకార పాలన
శంకర్‌పల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లుగా కొనసాగిస్తున్నది ప్రజాపాలన కాదని, ప్రతీకార పాలన అని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి వ్యాఖ్యానించారు. పట్టణంలో శనివారం బీఆర్‌ఎస్ ముఖ్య నాయకులతో ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి రెండేళ్లుగా పాలన గాలికి వదిలేసి, ప్రతిపక్ష నాయకుల మీద కేసులు, నోటీసులు అంటూ రాక్షసానందం పొందుతున్నారని దుయ్యబట్టారు. రెండేళ్లుగా సాగుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మున్సిపల్ ఎన్నికల సమయంలోనే గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు. బొగ్గు కుంభకోణంపై ప్రశ్నిస్తే మాజీ మంత్రి హరీశ్‌రావుకు సిట్ నోటీసులు, ఇదేమిటని ప్రశ్నించిన మాజీ మంత్రి కేటీఆర్‌కి నోటీసులు, ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే కక్షతో, డైవర్షన్ పాలిటిక్స్ చేసేందుకు కేసీఆర్‌కి నోటీసులు ఇస్తున్నారని విమర్శించారు. ఇన్నేళ్లుగా కేసీఆర్ ఫాంహౌస్ ఎక్కడుందో తెలియదని చెబుతూ సిట్ అధికారులు గోడలకు నోటీసులు అంటించడం ఆయనను అవమానపరచడమేనన్నారు. కాంగ్రెస్ నాయకులు ఎన్ని కుట్రలు పన్నినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని, మున్సిపల్ ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని, నిరంతరం సమస్యలు, కుంభకోణాలపై ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. కార్యకర్తలకు పార్టీ నాయకత్వం అండగా ఉంటుందని, ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు. పార్టీ టికెట్టు రాని వారికి భవిష్యత్తులో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు గోవర్థన్‌రెడ్డి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ శశిధర్‌రెడ్డి, మాజీ ఎంపీపీలు గోవర్దన్‌రెడ్డి, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి


