చేవెళ్లలో త్రిముఖ పోటీ
మెజార్టీ వార్డుల్లో ప్రధాన పార్టీల బరి
చేవెళ్ల: నూతన మున్సిపాలిటీలో మొదటిసారిగా జరుగుతున్న ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీలు పోటీ పడబోతున్నాయి. దీంతో ఇక్కడ త్రిముఖ పోటీ కనిపిస్తోంది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ మధ్యే పోటీ ఉండనుంది. ఇప్పటికే మున్సిపల్ పరిధిలోని 18 వార్డుల్లో పోటీకి అభ్యర్థులతో నామినేషన్లు వేయించారు. ఏ పార్టీ వారు ఎక్కడ ఉంటున్నారు.. వారికి ప్రత్యర్థిగా ఎవరు ఉండాలనే ఆలోచనతోనే అన్ని పార్టీలు అభ్యర్థులను ఖారారు చేశాయి. ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ బలోపేతంగా కనిపిస్తోంది. అన్ని స్థానాల్లో తన కేండెట్లను బరిలోకి దించి పోటీకి సై అంటోంది. ఇప్పటీకే పలు వార్డుల్లో ప్రచారం సైతం ప్రారంభించారు. నామినేషన్ల పర్వం ముగియడంతో, ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు.
ఫిరాయింపుల పర్వం
అన్ని పార్టీల్లో ఫిరాయింపుల పర్వం సాగుతోంది. పలువురు నాయకులు, కార్యక్తలు నిత్యం ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి జంప్ అవుతున్నారు. సొంత పార్టీలో టికెట్లు అశించే వారు కొందరైతే.. తమకు టికెట్ వచ్చే పరిస్థితి లేదని ఊహించిన మరికొందరు ఇతర పార్టీల్లోకి మారుతున్నారు. నాయకుల మార్పుతో ఓటర్లు ఎవరి వైపు ఉంటారో ఎవరికీ అర్థం కావటం లేదు. ఈక్రమంలో పార్టీలతో సంబంధం లేకుండా అభ్యర్థులను చూసి ఓట్లు వేసే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో ఏపార్టీ వారు వచ్చి ఓటు అడిగినా, మీకే వేస్తామని చెబుతున్నారు.
13వ వార్డులో పంచాయితీ
చేవెళ్లలోని 13 వార్డులో ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థులు రమేశ్, రాములు టికెట్లు ఆశిస్తున్నారు. వీరి మధ్య నెలకొన్న పంచాయితీ ఎటూ తేలడం లేదు. అధిష్టానం ఆశీస్సులు తమకే ఉంటాయని ఎవరికి వారే ధీమాగా ఉన్నారు. మద్దతుదారులతో కలిసి వెళ్లి పార్టీ పేరుతో, స్వతంత్రులుగా రెండు, మూడు సెట్ల నామినేషన్లు వేశారు. భీఫాం ఎవరికి ఇచ్చినా, మరొకరు రెబల్‌గా మారే అవకాశం ఉంది.
16వ వార్డులో పోటీకి వెనకడు
మున్సిపాలిటీలోని 16వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దేవర సమతావెంకట్‌రెడ్డి పోటీలో ఉన్నారు. దీంతో ప్రత్యర్థి పార్టీల నాయకులెవరూ బరిలో ఉండేందుకు ముందుకు రావడం లేదు. ఈవార్డులోనే అధికార పార్టీ నుంచి మాలతికృష్ణారెడ్డి సైతం చైర్మన్ రేసులో ఉండటంతో పాటు ఇదే వార్డు కావాలని పట్టు బట్టడంతో వీరి పంచాయితీ పార్టీ పెద్దల వరకూ వెళ్లింది. అధిష్టానం ఒకరికే అవకాశం ఇవ్వడంతో మరొకరు వెనకడుగు వేశారు. అన్ని వార్డుల్లో తీవ్ర పోటీ ఉండగా, ఇక్కడ మాత్రం నామినేషన్ వేసేందుకు ఎవరూ పెద్దగా సాహసం చేయలేదు. సమతావెంకట్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి చైర్మన్ అభ్యర్థిగా కూడా ప్రచారంలో ఉండగా అధికార, ఆర్థిక బలం ఉన్న అభ్యర్థి కావడంతో చాలా మంది ఆశావహులు, పోటీదారులు సైలెంట్ అయిపోయారు. అయితే, బీఆర్‌ఎస్, బీజేపీ నుంచి ఒక్కో అభ్యర్థిని పోటీకి దించారు. వీరు ఎంతవరకు నిలుస్తారోననే ఆసక్తి నెలకొంది.
కొన్ని వార్డుల్లో ఇప్పటికీ తేలని పంచాయితీ
ఎన్నికల వేళ కండువాలు మార్చేస్తున్న నాయకులు, కార్యకర్తలు
చేవెళ్లలో త్రిముఖ పోటీ


