వేలానికి వేళాయె
సాక్షి, సిటీబ్యూరో: మరోసారి భూముల వేలానికి హెచ్‌ఎండీఏ సన్నాహాలు చేపట్టింది. ఫ్లైఓవర్‌లు, ఎలివేటెడ్ కారిడార్‌లు, మెట్రో స్వాధీనం వ్యయం తదితర అవసరాలను దృష్టిలో ఉంచుకొని నిధుల సేకరణకు కసరత్తు చేస్తోంది. గత నవంబర్‌లో కోకాపేట్ నియోపొలిస్‌లో నిర్వహించిన ఆన్‌లైన్ బిడ్డింగ్‌కు భారీ స్పందన లభించింది. ఈ క్రమంలో హెచ్‌ఎండీఏ స్వయంగా చేపట్టిన పలు ప్రాజెక్టుల నిర్మాణానికి అధికారులు మరోసారి భూముల వేలం కోసం చర్యలు చేపట్టారు. ఆన్‌లైన్ బిడ్డింగ్ నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేశారు. తొలుత ఉప్పల్ భగాయత్, మోకిలలో గతంలో విక్రయించగా మిగిలిన ప్లాట్‌లకు ఫిబ్రవరిలో ఆన్‌లైన్ బిడ్డింగ్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇన్ముల్‌నర్వ, లేమూర్, తుర్కయంజాల్ తదితర ప్రాంతాల్లోని హెచ్‌ఎండీఏ లే అవుట్‌లలోని ప్లాట్‌లనూ దశలవారీగా విక్రయించనున్నారు.
నిధులు ఉంటేనే పరుగులు
● హెచ్‌ఎండీఏ కొత్తగా ప్రతిపాదించిన పలు ప్రాజెక్టులకు ప్రభుత్వం ఇటీవల పరిపాలన అనుమతులను అందించింది. దీంతో ఆ ప్రాజెక్టుల నిర్మాణం కోసం అధికారులు వివిధ మార్గాల్లో నిధులను సేకరించేందుకు చర్యలు చేపట్టారు. రుణాల సేకరణతో పాటు సొంత నిధుల అవసరాన్ని కూడా గుర్తించారు. ఈ మేరకు భూములు విక్రయించాలని నిర్ణయించారు.
● రేడియల్ రోడ్– 2 మార్గాన్ని ఔటర్‌రింగ్ రోడ్డు 143వ కిలోమీటర్ వద్ద కలిపేందుకు ప్రతిపాదించిన బుద్వేల్ ట్రంపెట్ ఇంటర్‌చేంజ్‌ను నిర్మించనున్నారు. దీనికోసం సుమారు రూ.488 కోట్లు వ్యయం కానున్నట్లు అంచనా.
● బంజారాహిల్స్ రోడ్ నెంబర్–12 నుంచి శిల్పా లేఅవుట్ వరకు సుమారు 9 కి.మీ ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మించనున్నారు. దీనికోసం రూ.1,656 కోట్లతో అంచనాలను రూపొందించారు.
● శంకర్‌పల్లి రోడ్‌లోని ఎంజీఐటీ నుంచి మణికొండ వరకు 3.57 కి.మీ పొడవున పైప్‌లైన్ రోడ్డు అభివృద్ధి పనులకు రూ.110 కోట్లతో అంచనాలను రూపొందించారు.
● నానక్‌రామ్‌గూడ నుంచి గచ్చిబౌలి వరకు ఓఆర్‌ఆర్‌కు ఎడమవైపున రహదారి విస్తరణ చేపట్టనున్నారు. 75 మీటర్ల రైట్ ఆఫ్ వేత్ (ఆర్‌ఓడబ్ల్యూ)తో రూ.26.50 కోట్లతో చేపట్టనున్నారు.
● కొత్తగా చేపట్టనున్న ఈ ప్రాజెక్టులతో పాటు ప్రస్తుతం ప్యారడైజ్ నుంచి డైరీఫామ్ వరకు, జేబీఎస్ నుంచి శామీర్‌పేట్ వరకు కొనసాగుతున్న ఎలివేటెడ్ కారిడార్‌ల కోసం కూడా పెద్ద మొత్తంలో నిధులు అవసరం.
ఎల్‌అండ్‌టీకి చెల్లింపులు
హైదరాబాద్ మెట్రో రైల్‌ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోనున్న నేపథ్యంలో ఒప్పందం ప్రకారం ఎల్‌అండ్‌టీకి చెల్లించాల్సిన సుమారు రూ.2000 కోట్లు హెచ్‌ఎండీఏ నుంచి అందజేసే అవకాశం ఉంది. రహదారుల విస్తరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా ఈ నిధులను వెచ్చించనున్నారు.
ఫిబ్రవరిలో హెచ్‌ఎండీఏ భూముల విక్రయాలు
ఉప్పల్ భగాయత్, మోకిల తదితర ప్రాంతాల్లో..
ఎలివేటెడ్ కారిడార్‌లు, రహదారుల విస్తరణకు నిధుల సేకరణ
మెట్రో స్వాధీనానికి హెచ్‌ఎండీఏ నుంచి నిధులు కేటాయించే అవకాశం


