డిగ్రీ విద్యార్థి ఆత్మహత్యాయత్నం
● జీవితంపై ఆందోళనతో మనస్తాపం ● పురుగు మందు తాగి అస్వస్థత
● నిమ్స్ ఆస్పత్రికి తరలింపు ● కేసు నమోదు చేసిన పరిగి పోలీసులు
పరిగి: భవిష్యత్తు, జీవితం ఎలా ఉంటుందోననే ఆందోళనతో మనస్తాపం చెందిన ఓ విద్యార్థి వసతి గృహంలో ఆత్మహత్యయత్నానికి పాల్పడిన ఘటన శుక్రవారం పరిగిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దేముల్ మండలం పాషాపూర్‌తండాకు చెందిన సంతోష్‌రాథోడ్(20) పట్టణంలోని తుంకుల్‌గడ్డ గిరిజన సంక్షేమ హాస్టల్లో ఉంటూ, ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో బీఎస్సీ ఫైనలియర్ చదువుతున్నాడు. శుక్రవారం ఉదయం విద్యార్థులు టిఫిన్‌కు వెళ్లగా, సంతోష్ మాత్రం రాలేదు. తిరిగి వచ్చిన స్నేహితులకు సంతోష్ వాంతులు చేసుకుంటూ కనిపించడంతో వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పురుగుల మందు తాగినట్లు ఆస్పత్రిలో చెప్పడంతో, మెరుగైన వైద్యం కోసం వికారాబాద్‌లోని పెద్దాస్పత్రికి రిఫర్ చేశారు. హాస్టల్ వార్డెన్ శంకర్ సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. తన భవిష్యత్తు ఎలా ఉంటుందోననే భయంతో, తెల్లవారుజామున ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్టు సంతోష్ వారికి చెప్పాడు. విద్యార్థి చికిత్స పొందుతుండగానే న్యాయమూర్తి అతని నుంచి వాంగ్మూలం తీసుకున్నట్లు వార్డెన్ తెలిపారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం సంతోష్‌ను నిమ్స్‌కు తరలించారు. ఇంత జరిగినా వార్డెన్ హాస్టల్‌లో అందుబాటులో లేరని, అంతా జరిగిన తర్వాత ఆస్పత్రికి వచ్చారని పలువురు విద్యార్థులు ఆవేదన వ్యక్తంచేశారు. వార్డెన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.


