అభ్యర్థులారా.. ఆలకించండి
‘నాపేరు.. పల్లెటూరు దేశానికి మరో పేరు..’ ఈ పాట ఎవరు రాశారో కానీ ప్రపంచానికి మేమంటే ఏమిటో చాటాం.. పచ్చదనం.. ప్రకృతి అందాలు.. గలగల పారే సెలయేళ్లు.. దేశానికి అన్నం పెట్టే అన్నదాతల సేవలు నా ప్రత్యేకతలు.. కానీ నేడు తీరు మారిపోయింది. నష్టాల ఏటిని కష్టంగా ఈదుతున్నా.. అభ్యర్థు లుగా కొత్త ఆశలు రేపి ముందుకు వస్తున్న మీలో ఎవరైనా రేపు గెలిచాక ప్రథమ పౌరులుగా.. ప్రజా సేవకులుగా మా సమ స్యలు పరిష్కరిస్తారని.. మాగోడు వెల్లబో సుకుంటున్నా. ఆలకించండి ఓసారి’..
– షాద్‌నగర్
పల్లె సీమ దేశానికి అన్నం పెట్టే భాండాగారం అన్నది మీ అందరికీ తెలుసు.. కానీ అదే పల్లెను ప్రతి ఒక్కరూ నిర్లక్ష్యం చేస్తున్నారన్నది ఎంత మందికి తెలుసు. షాద్‌నగర్ నియోజకవర్గాన్నే తీసుకుంటే.. ఇక్కడ 50 శాతం పల్లెలకు రహదారులు కూడా సక్రమంగా లేని పరిస్థితి.. ఏళ్లు గడుస్తున్నా గతుకుల రోడ్లే గతయ్యాయి. చాలా చోట్ల బస్సులు కూడా రావడం మానేశాయి. ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతున్నారు.. ఇక సీజన్ వచ్చిందంటే పారిశుద్ధ్య లేమి.. దుర్గంధంతో రోగాలు ముందుకు మమ్మల్నే తాకుతున్నాయి. మరో వైపు రియల్ ఎస్టేల్ వ్యాపారులు ఉన్న భూములను వెంచర్లుగా మార్చేశారు.. వ్యవసాయ క్రమంగా తగ్గుతోంది. వ్యవసాయదారులు, కూలీలకు కూడా పని లేకుండా పోతోంది. విద్యా వ్యవస్థ సరిగాలేదు. అభివృద్ధి కాగితాల్లో తప్ప మా ముంగిటకు చేరలేదు. మా జీవన శైలిలో మార్పు రాలేదు. సంక్షేమ పథకాలు తెస్తున్నారు.. కానీ అవి అర్హులకు సరిగా అందడం లేదు. మమ్ములను ఎన్నుకున్న సర్పంచులు మాగోడు పట్టించుకోకుండా కేవలం సొంత పనుల మీదే దృష్టి పెడుతున్నారు. ఇలాగైతే ఎలా బాగు పడాలి.. ఎప్పటికి ఈ పరిస్థితులు మారాలి. కొత్త అభ్యర్థులైనా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా.
కాలుష్య భూతం
కాలుష్య భూతం ప్రజలను వెంటాడుతోంది. ఇక్కడ ఎన్నో పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారు.. స్థానికులకు ఉద్యోగాలు మాత్రం ఇవ్వడం లేదు. వేర్వేరు రాష్ట్రాల నుంచి పని చేసే వాళ్లను తెచ్చుకుంటున్నారు. ఇక్కడి వాళ్లకు మాత్రం కాలుష్యాన్ని కానుకగా ఇస్తున్నారు. సుమారు 30 శాతం గ్రామాలు ఇబ్బందులకు గురువుతున్నాయి. పంటలు కాలుష్యంతో పాడైపోతన్నాయి. వీటిని పట్టించుకునేవారే కరువయ్యారు. వ్యవసాయం, పరిశ్రమల్లో ఉపాధి లేక చాలా మంది ఇతర రాష్ట్రాలకు వలసపోతున్నారు. ఎక్కడ చూసినా సగానికిపైగా తాళం వేసి ఉన్న ఇళ్లే కనిపిస్తున్నాయి. మరి ఈ పరిశ్రలతో ఎవరికి ఉపయోగం. ఈ ఎన్నికల్లో చాలా మంది వలస పోయిన ఓటర్లను ఫోన్‌ల ద్వారా పిలిపించుకొని ఓటు వేయించుకుంటున్నారు. బాగానే ఉంది.. మరి వాళ్లు ఎందుకు వలస వెళ్లారు. ఇన్ని పరిశ్రమలు ఉన్న వాళ్లకి ఇక్కడ ఎందుకు ఉపాధి దొరకడం లేదు. ఎప్పుడైనా ఆలోచించారా. కొత్త అభ్యర్థులైనా కనీసం దీనిపై ఆలోచించండి. స్థానికులకు పరిశ్రమల్లో ఉపాధి కల్పించే దిశగా పోరాటం చేయండి.. వలస పోకుండా ఇక్కడే ఉండి పల్లె సీమ నిండుదనాన్ని కాపాడండి.. పూర్వ వైభవం తెచ్చేలా .. ప్రగతివైపు అడుగులు వేసేలా మీరైనా చూడండి.. చూస్తారని.. చేస్తారని ఆశిస్తూ....
– ఇట్లు
మీ షాద్‌నగర్ నియోజకవర్గంలోని పల్లెలు
పాలకులు మారినా మా తలరాత మారలేదు
దశాబ్దాలు దాటినా ప్రగతికి నోచుకోలేదు
ఏళ్ల తరబడి సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నాం
కొత్తగా ఎన్నికయ్యే ప్రథమ పౌరులారా మీరైనా పట్టించుకోండి మా పల్లె వేదన


