ఎన్నికల నియమావళి ఉల్లంఘన.. కేసు నమోదు
ఫిలింనగర్: ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి బీఆర్‌ఎస్ నాయకులు సమావేశమై ఓటర్లను ప్రభావితం చేస్తున్నారంటూ ఫ్లయింగ్ స్క్వాడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫిలింనగర్ పోలీసులు పలువురిపై కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. ఫిలింనగర్ వెటర్నరీ కాలనీ ట్రిఫుల్ ఎం విల్లా ప్లాట్‌నెంబర్–4 వద్ద బీఆర్‌ఎస్ నాయకులు కప్పుల ఈశ్వర్, చింత ప్రభాకర్, బిగాల గణేష్ గుప్తా తదితరులు 40–50 మందితో సమావేశమై ఓటర్లను ప్రభావితం చేస్తున్నట్లు ఫ్లయింగ్ స్క్వాడ్ గుర్తించి ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీఆర్‌ఎస్ నాయకుడు మొయిజఖాన్ తన ఇంటిని సమావేశం కోసం అనుమతించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఈఓ ఆదేశాలను ఉల్లంఘించి ఎన్నికల వాతావరణానికి భంగం కలిగించారని తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఆగిఉన్న చెత్త లారీని ఢీ కొని బైకిస్టు మృతి
జవహర్‌నగర్: ఓ ద్విచక్ర వాహనదారుడు చెత్త లారీని ఢీ కొని తీవ్ర గాయాలపాలై మృతిచెందిన సంఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఫాల్గుణి యాదవ్ (38) బిహార్ నుండి వచ్చి జవహర్‌నగర్ మల్కారంలో కుటుంబంతో ఉంటున్నాడు. ఇతను జీవనోపాధి కోసం లడ్డూలు తయారుచేసి విక్రయిస్తుండేవాడు. సోమవారం సాయంత్రం లడ్డూలు సరఫరా చేసి వెళ్లి తిరిగి మల్కారంకు వస్తుండగా అర్ధరాత్రి డంపింగ్ యార్డు సమీపంలో రోడ్డు పక్కన నిలిపి ఉంచిన చెత్త లారీని ప్రమాదవశాత్తు ఢీ కొట్టాడు. దీంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. పోస్టుమార్టం నిమిత్తం గాంధీఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్ రాజేంద్రని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
గంజాయి మత్తులో
అల్లరిమూకల దాడి
నిజాంపేట్: రాజీవ్ గృహకల్పలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఓ బ్లాక్ కేంద్రంగా చేసుకుని అల్లరి మూక ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. కాగా సోమవారం రాత్రి కొంతమంది యువకులు అమాయుకులను రక్తం వచ్చేలా కొట్టారు. వనపర్తికి చెందిన తరుణ్‌నాయక్, సీతారాం నాయక్ ఇద్దరు అన్నదమ్ములు. ఉపాధి కోసం నగరానికి వలస వచ్చారు. వారు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రాజీవ్ గృహకల్పలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. ఇద్దరు ఆటో డ్రైవర్‌లుగా కొనసాగుతూ ఉపాధి పొందుతున్నారు. తాజాగా సోమవారం రాత్రి 11 గంటల సమయంలో తరుణ్ నాయక్ విధులు ముగించుకుని ఇంటికి వస్తున్నాడు. దారిలో కొందరు అల్లరి మూక రోడ్డుకు అడ్డంగా ఉండటంతో పక్కకు జరగాలని కోరారు. మమ్మల్నే పక్కకు తప్పుకోమంటావా అంటూ విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో తరుణ్ నాయక్‌కు తీవ్ర గాయాలు కాగా, అడ్డుకున్నందుకు అతని సోదరుడు సీతారం నాయక్‌ను సైతం త్రీవంగా కొట్టారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా మాపైనే పోలీసులకు ఫిర్యాదు చేస్తారా అంటూ మరోమారు వారి ఇంటికి వెళ్లి దాడి చేశారు.


