మితిమీరితే ఊచలే! | - | Sakshi
Sakshi News home page

మితిమీరితే ఊచలే!

Oct 17 2025 10:13 AM | Updated on Oct 17 2025 10:13 AM

మితిమీరితే ఊచలే!

మితిమీరితే ఊచలే!

వ్యూస్‌ కోసం విలువలు వదిలేస్తారా?

సాక్షి, సిటీబ్యూరో: ఇటీవల కాలంలో యూట్యూబ్‌ చానళ్లు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయాయి. దీంతో పాటు ఇతర సోషల్‌ మీడియాలోనూ పోటీ పెరిగిపోయింది. ఎవరికి వారు లైకులు, షేర్లు, వ్యూస్‌ కోసం వివిధ మార్గాలు ఎంచుకుంటున్నారు. కొందరైతే విశృంకలత్వానికి తెర లేపుతున్నారు. ఇంటర్వ్యూల పేరుతో మైనర్లను ఎంచుకుని అభ్యంతరకర వ్యాఖ్యలు చేయిస్తున్నారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న నగర పోలీసు కమిషనర్‌ విశ్వనాథ్‌ చన్నప్ప సజ్జనర్‌ గురువారం కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి వీడియోలు, ఇంటర్వ్యూలను అధ్యయనం చేస్తూ పోక్సోతో పాటు కిడ్నాప్‌ కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు.

ఆల్గరిథెమ్‌తో అత్యంత ప్రమాదకరం...

ఈ తరహాకు చెందిన అభ్యంతరకరమైన వీడియోలు, ఇంటర్వ్యూలు, రీల్స్‌ యూట్యూబ్‌తో పాటు ఇన్‌స్ట్రాగామ్‌ తదితర సోషల్‌మీడియాల్లోనూ అందుబాటులో ఉంటున్నాయి. ఇటీవల కాలంలో సోషల్‌మీడియా ఖాతాలు, ఈ–కామర్స్‌ వెబ్‌సైట్లు తదితరాలన్నీ ప్రత్యేక ఆల్గరిథెమ్‌ ఆధారంగా పని చేస్తున్నాయి. ఈ ఆల్గరిథెమ్‌ సదరు వ్యక్తి ఏ తరహా కంటెంట్‌ను వీక్షిస్తున్నారు? ఎలాంటి వస్తువులు ఖరీదు చేస్తున్నారు? సెర్చ్‌ చేస్తున్నారు? అనే అంశాలను అధ్యయనం చేస్తుంది. ఐపీ అడ్రస్‌, మెయిల్‌ ఐడీ ఆధారంగా జరిగే ఈ ప్రక్రియలో ఆ వ్యక్తికి అదే తరహా కంటెంట్‌, ఉత్పత్తులకు సంబంధించిన వీడియోలు, యాప్స్‌ పదేపదే పంపిస్తుంది. ఈ కారణంగా ఇలాంటి వీడియోలు, రీల్స్‌ను పొరపాటున మైనర్లు ఒక్కసారి వీక్షిస్తే చాలు..వారికి పదేపదే అదే తరహావి కనిపిస్తాయి.

పోక్సోతో పాటు కిడ్నాప్‌ కేసుకు ఆస్కారం...

ప్రేమ, పెళ్లి, భాగస్వామ్యం తదితర అంశాలపై మైనర్లలో సరైన అవగాహన పెరిగేలా, వారు పెడదారి పట్టకుండా వీడియోలు రూపొందిస్తే ఇబ్బంది ఉండదు. అయితే మైనర్ల ప్రేమ వ్యవహారాలు, ముద్దుమచ్చట్లను రీల్స్‌, వీడియోలు, ఇంటర్వ్యూలుగా చిత్రీకరించి మరింత మందిని పెడదోవ పట్టించడం నేరమే అవుతుంది. ఈ వీడియోలతో పాటు వాటిలో మైనర్లు, యాంకర్లు చేస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో పోక్సో యాక్ట్‌లోని పలు సెక్షన్ల కింద యాంకర్లు, నిర్వాహకులపై కేసులు నమోదు చేయవచ్చు. ఈ ఇంటర్వ్యూల కోసం ఆ మైనర్లను వివిధ ప్రాంతాల నుంచి మరో ప్రాంతానికి తరలించడమూ నేరమే. దీనికి సంబంధించి కిడ్నాప్‌ కేసు నమోదు చేసే అవకాశమూ ఉంది. ఇవన్నీ పరిశీలించిన కొత్వాల్‌ సజ్జనర్‌ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనిపై గురువారం కొతా్‌వ్‌ల్‌ ‘ఎక్స్‌’ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. ఇవి చూసిన అనేక మంది తమ వీడియోలు, రీల్స్‌, ఇంటర్వ్యూలను డిలీట్‌ చేస్తుండటం గమనార్హం.

వ్యూస్‌, లైక్స్‌తో పాటు సోషల్‌ మీడియాలో ఫేమస్‌ కావడానికి చిన్నారుల భవిష్యత్తును ఫణంగా పెట్టడం ఎంత వరకు సమంజసం? ఇది విలువలను వదిలేయడంతో సమానం. మైనర్లతో అసభ్యకరమైన కంటెంట్‌ చేస్తూ సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు? ఇలాంటి వీడియోలు వారితో చేసి పిల్లలను పెడదోవ పట్టించొద్దు. అలా చేయడం బాలల హక్కుల ఉల్లంఘన మాత్రమే కాదు..చట్టరీత్యా నేరం. బాలబాలికల్ని ఇలాంటి కంటెంట్‌లో భాగం చేయడం చైల్డ్‌ ఎక్స్‌ప్లాయిటేషనే అవుతుంది. ఇప్పటికే ఉన్న కంటెంట్‌ను తొలగించకున్నా, భవిష్యత్తులో అప్‌లోడ్‌ చేసినా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటాం. ఎవరైనా ఇలాంటి వీడియోలు, రీల్స్‌ గమనిస్తే 1930కు ఫోన్‌ చేసి లేదా (cybercrime.gov.in) ద్వారా ఫిర్యాదు చేయండి. పిల్లల బాల్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని, భవిష్యత్తును కాపాడటం కూడా తల్లిదండ్రుల బాధ్యతే.

– వీసీ సజ్జనర్‌, నగర కొత్వాల్‌

సోషల్‌మీడియా ఇంటర్వ్యూలపై సిటీ పోలీసుల కన్ను

మైనర్లతో అభ్యంతరకర వీడియోలు చేస్తున్న కొందరు

తీవ్రంగా పరిగణించిన నగర పోలీసు కమిషనర్‌ సజ్జనర్‌

పోక్సో యాక్ట్‌ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement