
పార్కింగ్ పరేషాన్
అబ్దుల్లాపూర్‌మెట్: విజయవాడ జాతీయ రహదారికి ఇరువైపులా నిర్మించిన సర్వీస్ రోడ్డుపై వాహనాలు అడ్డగోలుగా పార్క్ చేస్తున్నారు. దీంతో అటుగా ప్రయాణించే వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ప్రమాదాలు చోటు చేసుకుని మృత్యువాత పడుతున్నారు. జాతీయ రహదారికి ఇరువైపులా చిరు వ్యాపారులు, హోటళ్లు ఉండడంతో 24 గంటల పాటు వాహనాలు హైవేతో పాటు సర్వీస్ రోడ్డుపై పార్కింగ్ చేస్తున్నారు. వాహనాలను తీస్తున్న క్రమంలో వెనుక నుంచి వస్తున్న వాహనదారులు ఆందోళనకు గురై రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు. అక్రమ పార్కింగ్ చేస్తున్న వాహనదారులపై పోలీసులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రధాన కూడళ్లలో అక్రమ పార్కింగ్
జాతీయ రహదారి విస్తరణలో భాగంగా నిర్మించిన సర్వీస్ రోడ్డుపై ప్రధాన కూడళ్లలోనే వాహనదారులు అడ్డగోలుగా వాహనాలు నిలుపుతున్నారు. హయత్‌నగర్ నుంచి వర్డ్ అండ్ డీడ్, లక్ష్మారెడ్డిపాలెం, పెద్దఅంబర్‌పేట చెక్‌పోస్ట్, ఔటర్ రింగ్‌రోడ్డు, గండిమైసమ్మ దేవాలయం, రామోజీ ఫిల్మ్‌సిటీ గేటు ఎదుట, అబ్దుల్లాపూర్‌మెట్ మయూరి కాంట, ఇనాంగూడ, బాటసింగారం మౌంట్ ఒపెరా, కొత్తగూడెం ప్రాంతాల్లో రెండు వైపులా ఉన్న సర్వీస్ రోడ్డుపై వాహనాలను నిలిపివేస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సర్వీస్ రోడ్లపై వాహనాలను నిలుపుతుండడంతో గ్రామాలకు వెళ్లే కార్లు, ద్విచక్ర వాహనదారులకు ఇబ్బందులు పడుతున్నారు. భారీ వాహనాలను నిలిపే డ్రైవర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న వాహనాలను పక్కకు తీయాలని సూచించినా ఘర్షణలకు దిగుతున్నారు. పోలీసులు స్పందించి చర్యలు తీసుకోవాలి.
– కాశీనాథుని సత్యనారాయణశర్మ, అబ్దుల్లాపూర్‌మెట్
విజయవాడ హైవే సర్వీస్ రోడ్లపై అడ్డగోలుగా నిలుపుతున్న వాహనాలు
ప్రమాదాలతో జంకుతున్న ప్రయాణికులు
ఇబ్బంది పడుతున్న స్థానికులు
చర్యలు తీసుకోవాలని డిమాండ్