
కేంద్ర పథకాలతో పేదలకు భరోసా
● పథకాల అమలులో జిల్లా మొదటి స్థానంలో నిలవడం హర్షణీయం
● చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
చేవెళ్ల: కేంద్ర ప్రభుత్వం నిరుపేదలకు అమలు చేస్తున్న పీఎం జీవన జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై), ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్‌బీవై) పథకాలతో వారి కుటుంబాలకు భరోసా కల్పిస్తున్నాయని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. గురువారం నగరంలోని చేవెళ్ల ఎంపీ కార్యాలయంలో రంగారెడ్డి, వికారాబాద్ జిల్లా లీడ్‌బ్యాంక్ మేనేజర్లు సుశీల్‌కుమార్, యాదగిరితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ వారితో మాట్లాడుతూ.. కేంద్రం ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకాలను అన్నివర్గాల పేదలకు అందించి భరోసాను కల్పించాలని సూచించారు. అర్హులైన పేదలందరూ సంపూర్ణంగా వినియోగించుకోవాలన్నారు. ఈ బీమా పథకాలతో పాలసీదారుడు ప్రమాదవశాత్తు చనిపోయినా, సహజ మరణం పొందినా, శాశ్వత అంగవైక్యల్యం కలిగినా వారికి ఎంతో మేలు చేకూరుతుందని చెప్పారు. 2015లో ప్రారంభమైన ఈ పథకం జిల్లా అగ్రస్థానంలో ఉండటం హర్షణీయమన్నారు. జిల్లాలోని అన్ని బ్యాంకుల శాఖలు సమర్థవంతంగా పనిచేసి జిల్లాను ప్రథమ స్థానంలో ఉంచినందుకు ప్రత్యేకంగా అభినందనందించారు. 60 సంవత్సరాలు పైబడిన ప్రతీ వ్యక్తి యుక్త వయసులో దాచుకున్న సోమ్ముతో జీవితాంతం రూ.వేయి నుంచి రూ.5వేల వరకు పించన్ పొందే సౌకర్యం అటల్ పించన్ యోజనతో లభిస్తోందని చెప్పారు. ఈ పథకాన్ని సైతం ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కేవలం రూ.20 లేదా రూ.456 చెల్లించి బ్యాంకులు ఇచ్చే రూపే కార్డు ద్వారా దాదాపు రూ.6 లక్షల వరకు జీవిత బీమా పొందవచ్చునని తెలిపారు. కేంద్రం ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను, సబ్సిడీలను, యువతకు అందించే రుణాలపై ప్రత్యేక చొరవ చూపాలని బ్యాంకు మేనేజర్లను కోరారు. ఉమ్మడి జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు గ్రామస్థాయి వరకు మరింత కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, విక్రమ్, పి.శివప్రసాద్ పాల్గొన్నారు.