
పరుగులు తీ సేలా..
నగరం నలువైపుల నుంచి సులువుగా వెళ్లేలా..
● రేడియల్ రోడ్లతో అనుసంధానం
● గండిపేట నుంచి ఫిల్మ్ సిటీ వరకు గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు
● కొత్వాల్‌గూడ నుంచి లగచర్ల వరకు రహదారి
● చందన్‌వెల్లి, సీతారాంపూర్ సెజ్‌లతో లింక్
సాక్షి, సిటీబ్యూరో: మూసీ సుందరీకరణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోంది. మూసీలో స్వచ్ఛమైన నీరు ప్రవహించేలా చేయడంతో పాటు నది పరీవాహక ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయనున్నారు. ఈ పర్యాటక మూసీకి నగరం నలువైపుల నుంచి సులువుగా చేరుకునేలా పటిష్టమైన రహదారి వ్యవస్థ ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు తొలి దశలో మూసీకి పునరుజ్జీవం కల్పించనున్న గండిపేట నుంచి పలు మార్గాలలో గ్రీన్‌ఫీల్డ్ రహదారులను నిర్మించనున్నారు. దీంతో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా నగరం నలుదిక్కుల నుంచి మూసీకి రాకపోకలు సులువవుతాయని అధికారులు భావిస్తున్నారు.
గండిపేట టు ఫిల్మ్ సిటీ
మూసీ పునరుజ్జీవం ప్రాజెక్ట్‌లో భాగంగా తొలి దశలో జంట జలాశయాల నుంచి బాపూ ఘాట్ వరకు 21.5 కి.మీ. మేర అభివృద్ధి చేయనున్నారు. ఇందులో ఫేజ్–1ఏ కింద హిమాయత్‌సాగర్ నుంచి బాపూ ఘాట్ వరకు 9.5 కి.మీ., ఫేజ్–1 బీ కింద ఉస్మాన్‌సాగర్ నుంచి బాపూ ఘాట్ వరకు 11 కి.మీ. వరకు ఉంటుంది. కంపుకొట్టే మూసీలో స్వచ్ఛమైన నీరు ప్రవహించేలా చేయడంతో పాటు నది పరీవాహక ప్రాంతమైన గండిపేటను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయనున్నారు. ఇందులో భాగంగా నగరం నలువైపులా గండిపేటకు రాకపోకలు సులువుగా సాగేలా కొత్త రహదారులను నిర్మించాలని మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎంఆర్‌డీసీఎల్) అధికారులు ప్రతిపాదించారు. నగరంలోని ఓఆర్‌ఆర్‌ను ఓఆర్‌ఆర్‌తో అనుసంధానించమే లక్ష్యంగా పలు రేడియల్ రోడ్లను అభివృద్ధి చేయనున్నారు. ఇందులో భాగంగా గండి పేట నుంచి ఫిల్మ్ సిటీ వరకూ మూసీ వెంట కొత్త రోడ్డును నిర్మించనున్నారు. దీంతో గండిపేట సమీ పంలోని ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) నుంచి ఫిల్మ్ సిటీ వద్ద ఓఆర్‌ఆర్ వరకు ప్రస్తుత దూరం 85 కి.మీ.గా ఉండగా.. ఈ ప్రతిపాదిత రోడ్డుతో ట్రాఫిక్ అడ్డంకులు లేకుండా ఏకంగా 30 కి.మీ. దూరం తగ్గుతుంది.
‘గేట్ వే ఆఫ్ హైదరాబాద్’
దేశానికి ముఖద్వారమైన ‘గేట్ వే ఆఫ్ ముంబై’ తరహాలో తెలంగాణకు ‘గేట్ వే ఆఫ్ హైదరాబాద్’ ఐకానిక్ నిర్మాణాన్ని ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రపంచ పర్యాటకులను స్వాగతించేలా హిమాయత్‌సాగర్ సమీపంలో గాంధీ సరోవర్ వద్ద ఈ నిర్మాణాన్ని ఏర్పాటు చేయనున్నారు. ప్రతిపాదిత గేట్ వే ఆఫ్ హైదరాబాద్‌ను కనెక్టివిటీ హబ్‌గా అభివృద్ధిపరుస్తారు. ఈ ఐకానిక్ నిర్మాణం నుంచి కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లను కలుపుతూ చందన్‌వెల్లి, సీతారాంపూర్ సెజ్‌లకు రేడియల్ రోడ్‌తో అనుసంధానించనున్నారు. ఈ కొత్త గ్రీన్‌ఫీల్డ్ రోడ్ ఔటర్ రింగ్ రోడ్‌ను చించోలి హైవేకు కలుపుతుంది. దీంతో మూడు పారిశ్రామిక పార్క్‌లకు యాక్సెస్ మెరుగవుతుంది.
కల్చరల్ గ్రిడ్‌గా మూసీ
మూసీకి పూర్వవైభవం తీసుకురావాలంటే కేవలం నదిలో స్వచ్ఛమైన నీరు పారేలా చేయడం మాత్రమే కాదు.. నదిలో మురుగు నీరు చేరకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. ఇందులో భాగంగా నది చుట్టూ మురుగు నీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే నదిలో గోదావరి జలాలను పారేలా చేసేందుకు మల్లన్నసాగర్ ఆనకట్ట నుంచి 20 టీఎంసీల నీటిని తరలించి ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌లను నింపే ప్రయత్నాలను ప్రభుత్వం చేపట్టింది.
● మూసీని బహుళ ప్రయోజనకారిగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ ఆదేశాల మేరకు తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు మరో ఆర్థిక చక్రంగా చేయనున్నారు. దశల వారీగా ఈ ప్రాజెక్ట్‌ను హెచ్‌ఎండీఏ పరిధిలోని 55 కి.మీ. మూసీ నదిని పునరుజ్జీవం కల్పించనున్నారు. మూసీని వాటర్ గ్రిడ్‌గా మాత్రమే కాకుండా సాంస్కృతిక గ్రిడ్‌గా కూడా అభివృద్ధి చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా ప్రభుత్వం మంచిరేవులలోని 800 ఏళ్ల నాటి పురాతన శివాలయం, పాతబస్తీలోని మసీదు, సిఖ్‌చావనీలోని గురుద్వారా, ఉప్పల్‌లోని మెదక్ కేథడ్రిల్ తరహాలో చర్చిని అభివృద్ధి చేస్తారు.