
కార్మికులకు మోదీ చేసిందేమీ లేదు
సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
తుర్కయంజాల్: ప్రధాని నరేంద్రమోదీ సఫాయి కార్మికుల కాళ్లు కడుగుతూ ఫొటోలకు ఫోజులివ్వడం తప్ప వారి కడుపు నింపడం లేదని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ విమర్శించారు. పురపాలక సంఘం పరిధి రాగన్నగూడలోని చలసాని కల్యాణ మండపంలో సంఘం జిల్లా కార్యదర్శి డి. కిషన్ అధ్యక్షతన నిర్వహిస్తున్న తెలంగాణ మున్సిపల్ వర్క్‌ర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర 5వ మహాసభలకు మంగళవారం ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికులను భానిసత్వంలోకి నెట్టేస్తూ, కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తోందని ఆరోపించారు. మోదీ పేదలు, కార్మికుల కోసం చేసిందేమీ లేదని, హామీలకే పరమితమయ్యారని అన్నారు. ఎన్నో ఏళ్లుగా పోరాటాలు చేసి సాధించుకున్న అనేక లేబర్ కోడ్‌లను ఎత్తివేశారని దుయ్యబట్టారు. అంతకుముందు నాయకులు, కార్మికులు భారీ ర్యాలీగా రాగన్నగూడలోని జిల్లా కార్యాలయం నుంచి తరలి వచ్చారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్, ఎస్.వి.రఘు, కార్యదర్శి జె.వెంకటేశ్, ప్రధాన కార్యదర్శి రాజమల్లు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాజు, చంద్రమోహన్, నాయకులు ఈ.నరసింహ, జగదీష్, స్వప్న, సత్యనారాయణ, వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు.