
నేవీలో మంచి అవకాశాలు
హుడాకాంప్లెక్స్: ‘డీజే షిప్పింగ్ సాగర్ మే సమ్మాన్’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం సరూర్‌నగర్ వీఎంహోంలో స్కూల్ విద్యార్థులకు పదో తరగతి, ఇంటర్ తరువాత ఉద్యోగావకాశాలు అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన డీజే షిప్పింగ్ నోడల్ ఆఫీసర్, ట్రైనింగ్ రెహమాన్ కళాశాల ప్రిన్సిపాల్ డా.అశుతోష్ కుమార్ ఆపండ్కర్ మాట్లాడుతూ.. పదో తరగతి, ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు మర్చంట్ నేవీలో అనేక ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని తెలిపారు. నేవీ రంగంలో మహిళలకు పెద్ద ఎత్తున అవకాశాలు కల్పించాలని, మహిళా సాధికారత సాధించే లక్ష్యంతో ముదుకు వెళ్తున్నామని అన్నారు. మర్చంట్ నేవీలో 10వ తరగతి తరువాత ఒక సంవత్సరం శిక్షణ ఉంటుందని, ఇంటర్ తరువాత మూడేళ్లు బీఎస్సీ డిగ్రీ చదివిన వెంటనే వంద శాతం ఉద్యోగాలు మంచి వేతనంతో దొరుకుతాయని చెప్పారు. ట్రైనింగ్ షిప్ రెహమాన్ మర్చంట్ నేవీ శిక్షణలో అనేక కోర్సులు అందిస్తోందని వివరించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి మర్చంట్ నేవీలో విద్యార్థుల సంఖ్య పెరగాలని ఆకాంక్షించారు. మర్చంట్ నేవీలో ట్రైనింగ్ తీసుకుంటున్న విద్యార్థిని భీమగాని సత్య మాట్లాడుతూ.. విద్యార్థులు రొటీన్‌కు భిన్నంగా ఆలోచించాలని, ప్రత్యేక శిక్షణతో నేవీ రంగంలోకి అడుగు పెట్టాలని కోరారు. కార్యక్రమంలో అధ్యాపకులు మనీషా పాండే, వీఎంహోం ప్రిన్సిపాల్ పి.నర్సింహారెడ్డి, సూపరింటెండెంట్ లక్ష్మీపార్వతి, పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు భీమగాని మహేశ్వర్ పాల్గొన్నారు.
కెప్టెన్ అశుతోష్ కుమార్ ఆపండ్కర్