
పారదర్శకంగా ధాన్యం సేకరణ
● అక్రమాలకు తావివ్వొద్దు
● రైతులకు ఇబ్బంది రానివ్వొద్దు
● కొనుగోళ్లు సాఫీగా సాగాలి
● అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి
ఇబ్రహీంపట్నం రూరల్: ధాన్యం సేకరణలో అక్రమాలకు తావు లేకుండా, రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా సజావుగా కొనుగోళ్లు సాగేలా చూడాలని అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో మంగళవారం వానాకాలం పంట ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కొనుగోలు కేంద్రాల అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు, మిల్లర్లు, సివిల్ సప్లయ్ అధికారులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 34 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. దాదాపు 30వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని, 6 లక్షల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయన్నారు. పారదర్శకంగా ధాన్యం సేకరణ జరగాలన్నారు. ఎఫ్‌ఏ క్యూ ప్రమాణాలకు లోబడి బాగా ఆరబెట్టి, శుభ్రపర్చిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చేలా క్షేత్ర స్థాయిలో రైతులను చైతన్య పర్చాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. ధాన్యం సరఫరాకు వాహనాలను సమకూర్చుకోవాలని అన్నారు. అకాల వర్షాలతో తడిసిపోకుండా టార్పాలిన్లు, గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచాలని చెప్పారు. ట్రక్ షీట్లలో అవకతవకలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం సేకరణకు అవసరమైన గన్నీ బ్యాగులను కేంద్రాలకు సమకూరుస్తున్నట్టు వెల్లడించారు. జిల్లా యంత్రాంగం తరఫున అన్ని సహకారాలు అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. సదస్సులో డీఎస్‌ఓ వనజాత, సివిల్ సప్‌లై డీఏం హరీష్, డీసీఓ సుధాకర్, జిల్లా వ్యవసాయాధికారి ఉష తదితరులు పాల్గొన్నారు.