
విద్యుత్ లైన్ అలైన్‌మెంట్ మార్చేలా చూడండి
కడ్తాల్: మండల కేంద్రంతో పాటు పరిసర గ్రామా ల వ్యవసాయ పొలాల మీదుగా వేస్తున్న 765 కేవీ హైటెన్షన్ విద్యుత్‌లైన్ మార్చాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, రాజ్యసభ మాజీ సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో బాధిత రైతులు సోమవారం బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా తమ గోడు వెల్లబోసుకున్నారు. హైటెన్షన్ లైన్‌తో తీవ్రంగా నష్టపోతామని, అలైన్‌మెంట్ మార్చేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు స్పందించిన కేటీఆర్ బాధిత రైతులకు న్యాయం జరిగేవరకు న్యాయస్థానాల్లో పోరాడేందుకు కూడా తోడ్పాటునందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు దశరథ్‌నాయక్, మాజీ వైస్ ఎంపీపీ ఆనంద్, మాజీ సర్పంచ్ లక్ష్మీనర్సింహరెడ్డి, మాజీ ఉప సర్పంచ్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.