
భూమి పోతుందనే భయంతో..
గుండెపోటుతో వృద్ధుడి మృతి
కొందుర్గు: రేడియల్ రోడ్డులో తన భూమి పోతుందనే భయంతో ఓ వృద్ధుడు గుండెపోటుతో మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. మండలంలోని ఉమ్మెంత్యాల గ్రామానికి చెందిన వడ్ల మోనయ్య(68) సోమవారం రాత్రి ఇంట్లో టీవి చూస్తుండగా గుండెలో నొప్పి వచ్చింది. కుటుంబ సభ్యులు అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలిస్తుండగా కొందుర్గు పీహెచ్‌సీకి తీసుకెళ్లే లోపే ఆయన మృతిచెందాడు. మృతుడికి భార్య జయమ్మతోపాటు, ముగ్గురు కుమారులు ఉన్నారు. అయితే రెండు రోజుల క్రితం ఉమ్మెంత్యాల శివారులో రేడియల్ రోడ్డు కోసం మార్కింగ్ వేశారు. ఈ రోడ్డులో తన భూమి పోతుందని మోనయ్య రెండురోజుల నుంచి బాధపడ్డారు. భూమి పోతుందనే ఆందోళనలోనే గుండెపోటుతో మృతి చెందాడని మృతుడి కుటుంబ సభ్యులు వాపోయారు.
నాగర్‌గూడ వైన్స్‌లో చోరీ
షాబాద్: గుర్తు తెలియని వ్యక్తులు వైన్స్‌లో దూరి చోరీ చేసిన సంఘటన షాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ కాంతారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నాలుగేళ్లుగా మండలంలోని మద్దూరు గ్రామానికి చెందిన కప్ప హరిబాబు నాగర్‌గూడ దుర్గా వైన్స్‌లో పనిచేస్తున్నాడు. రోజు మాదిరిగానే ఆదివారం రాత్రి వైన్స్ బంద్ చేసి ఇంటికి వెళ్లాడు. సోమవారం ఉదయం వైన్స్‌లో దొంగలు పడ్డారని స్థానికులు తెలపడంతో హరిబాబు అక్కడికి వెళ్లాడు. దుండగులు రాత్రివేళ వైన్స్ వెనకాల గోడకు రంధ్రం చేసి షాపులో దూరి కౌంటర్‌లో ఉన్న రూ.43 వేలను ఎత్తుకెళ్లారు. నిర్వాహకులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.