
నేత్రదానానికి ముందుకు రావాలి
ఆమనగల్లు: నేత్రదానం చేయడానికి ప్రతిఒక్కరూ ముందుకు రావాలని లయన్స్‌క్లబ్ జిల్లా చైర్మన్ చంద్రశేఖర్ కోరారు. పట్టణంలోని ప్రభుత్వాసుపత్రిలో సోమవారం ఆమనగల్లు లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ.. నేత్ర, అవయవదానంపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. తమ మరణానంతరం నేత్రదానం చేయడం ద్వారా మరో ఇద్దరికి దృష్టి భాగ్యం కలుగుతుందని చెప్పారు. శిబిరంలో కంటి వైద్యులు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో 65 మందికి ఉచితంగా పరీక్షలు నిర్వహించారు. ఇందులో 15 మందిని కంటి ఆపరేషన్ల నిమిత్తం ఎనుగొండలోని రాంరెడ్డి లయన్స్‌కంటి ఆసుపత్రికి పంపించారు. కార్యక్రమంలో ఆమనగల్లు ప్రభుత్వాసుపత్రి వైద్యురాలు మైమునాబేగం, ఎంపీహెచ్‌ఈఓ తిరుపతిరెడ్డి, లయన్స్‌క్లబ్ ఉపాధ్యక్షుడు బాలకృష్ణ, కార్యదర్శి వెంకటయ్య, పీఆర్‌ఓ పాషా, మాజీ అధ్యక్షుడు యాదయ్య తదితరులు పాల్గొన్నారు.