
రక్తమోడుతున్న రహదారి..!
శంషాబాద్ రూరల్: రహదారి విస్తరణ పనుల్లో జాప్యం నెలకొనడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తొండుపల్లి రైల్వే వంతెన సమీపం నుంచి పాల్మాకుల వరకు మండల పరిధిలో జరుగుతున్న పనుల కారణంగా వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. పనులను ప్రారంభించి దాదాపు మూడేళ్లు గడిచినా... ఓ అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కు అన్నట్లుగా మారింది. ఈ రహదారిపై రాత్రి సమయంలో ప్రయాణం వాహనదారులకు నరక ప్రాయమవుతోంది.
ఆరు వరుసలుగా...
శంషాబాద్ మున్సిపల్ పరిధిలోని తొండుపల్లి నుంచి కొత్తూరు వరకు 12 కిలోమీటర్ల దూరం వరకు ఈ జాతీయ రహదారిని విస్తరిస్తున్నారు. ప్రస్తుతం నాలుగు వరుసలుగా ఉన్న రహదారిని ఆరు వరుసలకు విస్తరించడానికి సుమారు రూ. 540 కోట్లు కేటాయించారు. ఈ పనులను 2022 ఏప్రిల్‌లో కేంద్ర మంత్రి ఘడ్కరీ ప్రారంభించారు. ఆరంభంలో పనులు జోరుగా సాగినా.. మధ్యలో ఏడాది పాటు పనులు నిలిచిపోయాయి. అడపాదడపా అక్కడక్కడ పనులు చేస్తూ.. కాలం సాగదిస్తున్నారు.
ప్రమాదాలతో ప్రాణాలకు ముప్పు...
విస్తరణ పనులు పూర్తి కాకపోవడంతో రహదారిపై జరుగుతున్న ప్రమాదాలతో వాహనదారులు ప్రాణాలు కోల్పోతున్నారు. రెండేళ్ల కాలంలో పదుల సంఖ్యలో వాహనదారుల ప్రాణాలు గాల్లో కలిసాయి. ఇక గాయాలై ఆస్పత్రి పాలైన వాహనదారులు చాలా మంది ఉన్నారు.
● రెండు నెలల కిందట మదన్‌పల్లి శివారులో రహదారిపై బైక్ మీద వెళ్తున్న ఇద్దరు యువకులు రోడ్డు పక్కన నిర్మాణ సామగ్రిని ఢీకొని అక్కడిక్కడే మృతి చెందారు.
● పాల్మాకుల శివారులో బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి రహదారిపై జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.
● ఏదైనా ప్రమాదం జరిగినా.. వాహనాలు మరమ్మతులకు గురైనా రోడ్డుపై గంటల కొద్ది ట్రాఫిక్ నిలిచిపోతుంది. రాత్రి వేళల్లో జరిగే ఘటనలతో వాహనదారులు చాలా అవస్థలు పడుతున్నారు.
బెంగళూరు జాతీయ రహదారి విస్తరణ పనుల్లో జాప్యం
వాహనదారులకు శాపం
పనులను వేగంగా పూర్తి చేయాలి
రహదారి పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తి చేయాలి. ఈ రోడ్డుపై ట్రాఫిక్ రద్దీ పెరిగి ప్రమాదాలు జరుగుతున్నాయి. అఽధికారులు చొరవ తీసుకుని పనులను సకాలంలో పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలి.
– పి.శ్రీనివాస్‌రెడ్డి, పాల్మాకుల

రక్తమోడుతున్న రహదారి..!

రక్తమోడుతున్న రహదారి..!