
రోడ్డు పాడు చేశారంటూ కారు డ్రైవర్‌పై ఫిర్యాదు
మణికొండ: భారీ వర్షాలతో గుంతల మయంగా మారిన రోడ్డు పనులను ఓ వైపు చేస్తుండగానే ఓ కారు దానిపైకి వచ్చి మొత్తం పాడు చేసింది. దాంతో ఇంజనీరింగ్ అఽధికారులు కారు యజమానిపై పోలీసులకు ఫిర్యాదు చేసి కారును పోలీసులకు అప్పగించారు. మణికొండ మున్సిపాలిటీ కేంద్రంలోని పాత ఆంధ్రాబ్యాంక్ చౌరస్తా నుంచి మర్రిచెట్టు వైపు ఉన్న రోడ్డు గుంతల మయంగా మారటంతో రెండు రోజులుగా కొత్త రోడ్డు పనులను చేపడుతున్నారు. ఆ విషయం గమనించకుండా ఆదివారం ఉదయం ఓ కారు వేస్తున్న రోడ్డుపైకి వచ్చి మొత్తం పాడు చేసింది. విషయం తెలుసుకుని మణికొండ మున్సిపల్ డీఈ శివసాయి సదరు కారు యజమానిపై రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసి కారును వారికి అప్పగించినట్టు తెలిపారు. ప్రజలందరికీ అవసరమయ్యే పనులను చేపడుతున్నపుడు వారు సహకరించాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. పది రోజుల పాటు సదరు రోడ్డును మూసి ఉంచుతున్నామని, ప్రయాణికులు ఇతర రోడ్ల ద్వారా వెళ్లాలని ఆయన కోరారు.