
రేపటి నుంచి యథావిధిగా ప్రజావాణి
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రజావాణి కార్యక్రమం సోమవారం నుంచి యథావిధిగా కొనసాగుతుందని కలెక్టర్ సి.నారాయణరెడ్డి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో స్థానిక ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన సందర్భంగా ఈ నెల 6వ తేదీ నుంచి రద్దు చేయడం జరిగిందని తెలిపారు. హైకోర్టు స్టే విధించిందున రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు వాయిదా వేయడం జరిగిందని, ప్రజావాణి కార్యక్రమాన్ని ఎప్పటిలాగే కొనసాగించడం జరుగుతుందని చెప్పారు. ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గమనించి జిల్లా యంత్రాంగానికి సహకరించాలని ఆయన కోరారు.
పహాడీషరీఫ్: రాష్ట్రంలో మున్సిపల్ కార్యాలయాల్లో పనిచేస్తున్న కారోబార్, బిల్ కలెక్టర్‌ల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర అవుట్ సోర్సింగ్ కారోబార్, బిల్ కలెక్టర్ల కమిటీ కోరింది. ఈ మేరకు కమిటీ నాయకులు రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చల్లా నర్సింహా రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. 2016లో ఇచ్చిన జీవోఎంఎస్–14 ప్రకారం మున్సిపాలిటీలో కలిసిన గ్రామ పంచాయతీ సిబ్బంది సమస్యలు పరిష్కరించడం లేదన్నారు. తమకు కేటాయించిన పనులను సమర్థవంతంగా చేస్తున్నప్పటికీ, నెలకు కేవలం రూ.15,600 మాత్రమే చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి పని చేస్తున్న అందరినీ రెగ్యులరైజ్ చేయాలని, కనీస వేతనం రూ.22,750 చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.
ఇబ్రహీంపట్నం: డీజీపీ శివధర్‌రెడ్డిని ఇబ్రహీంపట్నం బార్ అసోసియేషన్ కమిటీ సభ్యులు శనివారం మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా 12 కోర్టు భవన సముదాయాల నిర్మాణం గురించి వివరించారు. తనవంతు సహకారం అందిస్తానని శివధర్‌రెడ్డి తెలిపినట్లు వారు చెప్పారు. అదేవిధంగా న్యాయశాఖ కార్యదర్శి పాపిరెడ్డిని సైతం కలిసి స్థానిక సమస్యలను వివరించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ముద్ద వెంకటేశ్, ప్రధాన కార్యదర్శి అరిగే శ్రీనివాస్‌కుమార్, ఉపాధ్యక్షుడు ఎలమొని భాస్కర్, లైబ్రరీ సెక్రటరీ నిట్టు పాండు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం: ప్రజాహితం పర్యావరణ పరిరక్షణ సమితి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 8 గంటలకు ఇబ్రహీంపట్నం బీడీఎల్ రోడ్డు నుంచి 2 కే రన్ ప్రారంభం అవుతుందని సంస్థ చైర్మన్ సురేష్ తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డితో పాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నట్టు చెప్పారు. మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
అనంతగిరి: ఆర్‌ఎస్‌ఎస్ పథ సంచలన్ (కవాతు) వికారాబాద్ పట్టణంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఆర్‌ఎస్‌ఎస్ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని చేపడుతున్న కార్యక్రమంలో భాగంగా భారీ కవాతు నిర్వహించారు. పట్టణంలోని కొత్తగంజ్ నుంచి ప్రారంభమై ప్రధాన వీధుల మీదుగా సాగింది. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆర్‌ఎస్‌ఎస్ ప్రాంత సద్భావన సహ ప్రముఖ్ రామకృష్ణ మాట్లాడుతూ.. ఽహిందూ ధర్మ పరిరక్షణకు ఆర్‌ఎస్‌ఎస్ పాటుపడుతుందన్నారు. ఈ దేశానికి ఘనమైన చరిత్ర ఉందన్నారు. యావత్ ప్రపంచానికే దిశానిర్దేశం చేసిన ఘనత భరత భూమికే దక్కుతుందన్నారు. హిందూ సమాజం ఐక్యతతో ముందుకు సాగాలని.. రాబోయే రోజుల్లో ప్రపంచానికే దేశంఆదర్శంగా నిలవబోతుందన్నారు.

రేపటి నుంచి యథావిధిగా ప్రజావాణి