గిట్లయిపాయె! | - | Sakshi
Sakshi News home page

గిట్లయిపాయె!

Oct 10 2025 12:26 PM | Updated on Oct 10 2025 12:26 PM

గిట్లయిపాయె!

గిట్లయిపాయె!

ఎన్నికల నోటిఫికేషన్‌పై హైకోర్టు స్టే

ఇలా నామినేషన్లు .. అలా నిలిపివేత

మళ్లీ మొదటికొచ్చిన ఎలక్షన్‌ ప్రక్రియ

అంతర్మథనంలో ఆశావహులు

సాక్షి, రంగారెడ్డిజిల్లా: స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చింది. ప్రధాన రాజకీయ పార్టీల్లో రెండు రోజుల నుంచి నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ సహా ఎన్నికల కమిషన్‌ జారీ చేసిన షెడ్యూల్‌, నోటిఫికేషన్లపై కోర్టు స్టే విధించింది. ఇప్పటికే సహచర నాయకులను ఒప్పించి ఎంపీటీసీ, జెడ్పీటీసీ టికెట్లను ఖరారు చేసుకున్న అధికార, ప్రతిపక్ష పార్టీల ఆశావహులకు కోర్టు తీర్పుతో గొంతులో పచ్చి వెలక్కాయపడినట్లైంది. ఇప్పటికే ఆయా స్థానాలకు రిజర్వేషన్ల ప్రాతిపదికన అభ్యర్థుల పేర్లను ఖరారు చేసిన రాజకీయ పార్టీలకు చుక్కెదురైంది. ఇదిలా ఉంటే మూడు డివిజన్ల పరిధిలో పలు ఎంపీటీసీ స్థానాలకు తొలి రోజున ఎనిమిది నామినేషన్లు దాఖలయ్యాయి. జెడ్పీటీసీ స్థానాలకు మాత్రం ఒక్కటి కూడా దాఖలు కాలేదు.

ఇప్పటికే భారీగా ఖర్చు

జిల్లాలో 21 జెడ్పీటీసీ, 230 ఎంపీటీసీ, 526 గ్రామ పంచాయతీలు, 4,668 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కులగణన ఆధారంగా డెడికేషన్‌ కమిషన్‌ ఇచ్చిన నివేదిక ప్రకారం బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం గత నెల 27న జీఓ నంబర్‌ 9ని విడుదల చేసింది. 29న ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌ జారీ చేసింది. ఒకవైపు హైకోర్టులో కేసు నడుస్తుండగా.. మరోవైపు జిల్లా ఎన్నికల యంత్రాంగం ఆయా ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఇప్పటికే ఓటర్ల జాబితా, పోలింగ్‌ స్టేషన్ల ఎంపిక, బ్యాలెట్‌ బాక్సులు, నోడల్‌ ఆఫీసర్లు, రిటర్నింగ్‌ అధికారుల నియామకం, నామినేషన్ల స్వీకరణ ప్రక్రియకు ఏర్పాట్లు చేసింది. ఆశావహులతో పాటు రాజకీయ పార్టీలు సైతం అభ్యర్థుల పేర్లను దాదాపు ఖరారు చేసుకున్నాయి. తీరా గురువారం ఉదయం ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ జారీ చేసి, అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలు పెట్టిన తర్వాత ఎన్నికల నిర్వహణపై హైకోర్టు స్టే విధించింది. ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు ఇప్పటికే భారీగా ఖర్చు చేసిన ఆశావహులు కోర్టు తీర్పుతో అంతర్మథనంలో పడ్డారు. రిజర్వేషన్లు మారితే తమ పరిస్థితి ఏమిటి అనే ఆందోళన వారిలో మొదలైంది.

పరస్పర విమర్శలు

స్థానిక సంస్థల్లో బీజీ రిజర్వేషన్లు, ఎన్నికల నోటిఫికేషన్‌పై కోర్టు స్టే విధించిన నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలకు కోర్టు తీర్పే తాజా నిదర్శనమని ప్రతిపక్ష బీజేపీ, బీఆర్‌ఎస్‌లు వాదిస్తుండగా, కోర్టుల్లో కేసులతోప్రతిపక్షాలు బీసీలకు తీరని అన్యాయం చేస్తున్నారని అధికార కాంగ్రెస్‌ విమర్శిస్తోంది. తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు నిలబెట్టడానికి అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమైన నిర్వాకం కారణంగానే హైకోర్టు స్టే ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందని బీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీకి బీసీల ఆదరణ దక్కుతుందనే అక్కసుతోనే ప్రతిపక్ష పార్టీలు రిజర్వేషన్లకు అడ్డు తగులుతున్నాయని హస్తం పార్టీ విమర్శిస్తోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రభుత్వం ముందు నాలుగు ప్రతిపాదనలు మాత్రమే మిగిలి ఉన్నాయి. వీటిలో ఒకటి పాత రిజర్వేషన్ల ప్రకారం మరోసారి నోటిఫికేషన్‌ జారీ చేయడం, సుప్రీం కోర్టుకు వెళ్లి.. హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేయించడం, లేదంటే పార్టీ తరఫున 42 శాతం సీట్లను బీసీలకు కేటాయించి ఎన్నికలకు వెళ్లడం, కోర్టు తీర్పు వచ్చే వరకు ఎన్నికలను వాయిదా వేయడం మాత్రమే మిగిలి ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement