
ఆర్టీసీకి ఆదాయ‘మస్తు’
అందరి కృషితోనే ..
అదనపు ఆదాయం
షాద్‌నగర్/ ఇబ్రహీంపట్నం: వరుస పండుగలు ఆర్టీసీకి భారీగా కలిసొచ్చాయి. బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా ప్రత్యేక బస్సులను నడిపించారు. స్వగ్రామాలకు బస్సుల్లో ప్రయాణించిన వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులను నడిపించారు. ఫలితంగా షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం డిపోలకు అదనంగా రాబడి పెరిగింది. షాద్‌నగర్ డిపోలో 2 లక్షల 56వేల కిలోమీటర్లకు పైగా బస్సులు తిరిగినట్లు అధికారులు తెలిపారు.
● షాద్‌నగర్ డిపోకు సెప్టెంబర్ 29 నుంచి ఈనెల 6వ తేదీ వరకు రూ. 1.88 కోట్లు వచ్చాయి. దసరా పండగ ముందు రోజు అక్టోబర్ 1న రూ.22 లక్షలు, 5వ తేదీ రూ.31.32 లక్షలు, 6వ తేదీ రూ.41.24 లక్షలు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
● ఇబ్రహీంపట్నం డిపోకు సెప్టెంబర్ 27 నుంచి ఈ నెల 5వ తేదీ రూ.3 కోట్లు సమకూరినట్లు అధికారులు వెల్లడించారు.
మహాలక్ష్ముల ప్రయాణం
పండుల నేపథ్యంలో వారం రోజుల్లో షాద్‌నగర్ డిపో నుంచి 1,07,722 మంది మహిళలు ప్రయాణించారు. సెప్టెంబర్ 27న 22,877 మంది, 28న 26,652 మంది, 29న 27,376 మంది, 30న 29,633 మంది, సెప్టెంబర్ 1న 26,540 మంది, 5న 29,406 మంది, 6న 35,238 మంది ప్రయాణించారు. ఇబ్రహీంపట్నం డిపోలో రూ.1.75 కోట్లు మహలక్ష్మి టికెట్ల ద్వారా సమకూరింది.
పండుగలకు ప్రయాణికుల కిటకిట
సంస్థకు భారీగా రాబడి
షాద్‌నగర్ డిపోకు వారంలో రూ.1.88 కోట్లు
ఇబ్రహీంపట్నం డిపోకు రూ.3 కోట్లు
పండుగ సందర్భంగా ప్రత్యేక బస్సులు నడిపించాం. ఆర్టీసీ కార్మికులు, అధికారుల సమష్టి కృషితోనే అనుకున్న మేర ఆదాయం వచ్చింది. ప్రయాణికులకు సౌకర్యాలు కల్పిస్తూ మరింత ఆదాయం పెంచే దిశగా ముందుకు సాగుతాం.
– ఉష, డిపో మేనేజర్, షాద్‌నగర్
వివిధ ప్రాంతాలకు 40 స్పెషల్ బస్సులను నడిపించాం. వీటి ద్వారా రూ.80 లక్షలు, ఆయా హాస్టళ్ల నుంచి విద్యార్థులను గమ్యస్థానాలకు చేర్చినందుకు మరో రూ.40 లక్షల ఆదాయం సమకూరింది.
– వెంకటనర్సప్ప, డిపో మేనేజర్, ఇబ్రహీంపట్నం