మాల్స్‌పై స్పెషల్‌ డ్రైవ్‌ | - | Sakshi
Sakshi News home page

మాల్స్‌పై స్పెషల్‌ డ్రైవ్‌

Oct 10 2025 12:26 PM | Updated on Oct 10 2025 12:26 PM

మాల్స్‌పై స్పెషల్‌ డ్రైవ్‌

మాల్స్‌పై స్పెషల్‌ డ్రైవ్‌

తప్పుడు వివరాలు సరిదిద్దే చర్యలు

ఆదాయం పెంచుకునే దిశగా జీహెచ్‌ఎంసీ

ప్రాపర్టీట్యాక్స్‌, ట్రేడ్‌ లైసెన్స్‌ పన్నుల వసూలు కోసం

సాక్షి, సిటీబ్యూరో: ఏటికేడు ఆస్తిపన్ను వసూళ్ల ఆదాయం పెరుగుతున్నప్పటికీ, జీహెచ్‌ఎంసీలోని అన్ని భవనాల నుంచి రావాల్సినంత ఆస్తిపన్ను మాత్రం రావడం లేదు. ప్రతియేటా నిరుటి కంటే ఈ యేడు ఎక్కువ ఆస్తిపన్ను వసూలు చేద్దామనే పాత ఆలోచనలకు స్వస్తి పలికి, వాస్తవంగా ఎంత ఆదాయం రావాలో అంత వసూలు చేసి ఖజానాను నింపుకోవాలనే ఆలోచనతో జీహెచ్‌ఎంసీ అధికారులు స్పెషల్‌ డ్రైవ్‌లు చేపట్టారు. తొలుత, మాల్స్‌ నుంచి సరైన ఆస్తిపన్నును వసూలు చేయడంతోపాటు ట్రేడ్‌ లైసెన్స్‌ ఫీజులు కూడా వసూలు చేసే చర్యలకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా జీహెచ్‌ఎంసీ పరిధిలోని అన్ని మాల్స్‌ను క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేసి, భవనం విస్తీర్ణానికి అనుగుణంగా ఆస్తిపన్ను డిమాండ్‌ ఉందా, లేక రావాల్సిన ఆస్తిపన్ను కంటే తక్కువ డిమాండ్‌ ఉందా? అన్నది తనిఖీ చేస్తున్నారు. ఒకవేళ రావాల్సినంత ఆస్తిపన్ను కంటే తక్కువ డిమాండ్‌ ఉన్నట్లయితే రివిజన్‌ చేసి సరైన ఆస్తిపన్ను విధించి వసూలు చేయనున్నారు.

ట్రేడ్‌ లైసెన్సులపైనా గురి

అలాగే.. మాల్స్‌లోని అన్ని వ్యాపార సంస్థలకు ట్రేడ్‌ లైసెన్సులున్నాయా? ఉంటే నిబంధనలకు అనుగుణంగా లైసెన్సు ఫీజులు చెల్లిస్తున్నారా? అనే వివరాలపైనా సర్వే చేస్తున్నారు. వీటిల్లోనూ ఏవైనా వ్యత్యాసాలుంటే తగిన చర్యలు తీసుకోనున్నారు. ఈ తనిఖీలకు సంబంధిత సర్కిల్‌ డిప్యూటీ కమిషనర్‌ స్వయంగా వెళ్లాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. సర్వే దాదాపుగా పూర్తి కావచ్చిందని అధికారులు తెలిపారు. ఎంత మేర ఆదాయం పెరగనుందో ఒకటి రెండు రోజుల్లో తెలియనుంది. తనిఖీలతో పాటే పేరుకుపోయిన బకాయిలనూ వసూలు చేస్తున్నారు. తనిఖీల్లో భాగంగా మాల్స్‌లో ఉన్న వ్యాపారం రకం, నిర్వహిస్తున్న సంస్థ పేరు, దాని పీటీఐఎన్‌, ఆస్తిపన్ను వార్షిక డిమాండ్‌, బకాయిలుంటే ఎంత మొత్తం, ఆస్తిపన్ను డిమాండ్‌ భవనం విస్తీర్ణానికి తగ్గట్లుగా ఉందా? లేక తక్కువ మొత్తం ఉందా? వంటి వివరాలతో పాటు అసలు ఆస్తిపన్ను జాబితాలో నమోదుకాని పీటీఐఎన్‌లు లేని వాటిని కూడా గుర్తించనున్నారు. రివిజన్‌ చేసి సరైన ఆస్తిపన్ను విధించే చర్యలు కూడా చేపట్టారు. బకాయిలున్నవారి నుంచి ఆస్తిపన్ను వసూళ్ల చర్యలు కూడా చేపట్టారు.

నివాసేతర భవనాలన్నింటిపై..

మాల్స్‌ స్పెషల్‌ డ్రైవ్‌ పూర్తయ్యాక, నివాసేతర భవనాలన్నింటి తనిఖీలకు ఆయా అంశాల వారీగా స్పెషల్‌డ్రైవ్స్‌ చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. వివిధ రకాల దుకాణాలతో పాటు బ్యాంకులు, ఆస్పత్రులు, షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, గోడౌన్లు, సెల్‌ టవర్లు, ఆఫీసులు, ఏటీఎంలు బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, స్టార్‌ హోటళ్లు, ఫ్యాక్టరీలు, విద్యాసంస్థలు, జిమ్స్‌, పెట్రోలు బంకులు, సినిమా థియేటర్లు, మ్యారేజ్‌ హాళ్లు తదితరాలు వీటిలో ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement