
పూల సాగు.. లాభాలు బాగు
● ప్రత్యామ్నాయ పంటలపై రైతుల ఆసక్తి
● ప్రభుత్వం సహకరించాలని విజ్ఞప్తి
మొయినాబాద్‌రూరల్: పుష్పాల సాగు రైతులకు ఆదాయ పరిమళం కురిపిస్తోంది. గతంలో సంప్రదాయ పంటలు సాగు చేసి ప్రకృతి వైపరీత్యాలతో నష్టాలను చవిచూసిన రైతులు ప్రస్తుతం తక్కువ పెట్టుబడులతో అధిక లాభాలను ఆర్జించేందుకు శ్రీకారం చుడుతున్నారు. ప్రత్యామ్నాయంగా కూరగాయలు, పూల తోటల సాగుతో అధిక దిగుబడులు సాగించవచ్చని నిరూపిస్తున్నారు. నియోజకవర్గంలో దాదాపు 1,200 ఎకరాలలో పూల సాగు చేస్తున్నారు. అందులో మొయినాబాద్ మండలంలోనే 300 ఎకరాల్లో పండిస్తున్నారు. మండల పరిధిలోని అమ్డాపూర్, కాశీంబౌలి, బాకారం, వెంకటాపూర్, చిన్నమంగళారం, రెడ్డిపల్లి, కుతుబుద్దీన్‌గూడ, వీరన్నపేట్, చందానగర్, మోత్కుపల్లి, కనకమామిడి, కంచమౌనిగూడ, శ్రీరామ్‌నగర్, కేతిరెడ్డిపల్లి, సజ్జన్‌పల్లి ఆయా గ్రామాల్లో ఎక్కువగా గులాబీతో పాటు చామంతి, బంతి పూల తోటలు సాగు చేస్తున్నారు. చేవెళ్ల మండలంలోని కందవాడ, పల్‌గుట్ట, గుండాల, చందన్‌వెల్లి, దేవరంపల్లి గ్రామాల్లో రైతులు సైతం పూల సాగుపై ఆసక్తి చూపుతున్నారు.
మార్కెట్‌లో డిమాండ్
రైతులు పండిస్తున్న బంతి, చామంతి పూలకు శుభకార్యాలు ప్రారంభం కావడంతో పాటు సమీపిస్తున్న దీపావళి పండుగతో గిరాకీ వస్తుందని రైతులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం బంతి కిలో రూ.50–60, చామంతి రూ.80–100 ధర పలుకుతుందని చెబుతున్నారు.
సబ్సిడీ లేదు
మొయినాబాద్, చేవెళ్ల, శంకర్‌పల్లి మండలాలలో అధికంగా పూల సాగు చేస్తారు. భారీ వర్షాలు కురవడంతో ఈ ఏడాది దిగుబడి తగ్గింది. రైతులు సబ్సిడీ నారు కోసం ఆరా తీస్తున్నారు. కానీ పూల సాగుకు ప్రభుత్వం నుంచి సబ్సిడీ లేదు. కూరగాయాల సాగుకు సబ్సిడీ ఉంది.
– కీర్తి, ఉద్యానవన శాఖ, చేవెళ్ల
రూ.40 వేలు లాభం
ఏటా చామంతి సాగు చేస్తున్నాను. దసరా, దీపావళితో పాటు పెళ్లిళ్ల సీజన్ ఉండడంతో గిరాకీ ఉంది. ఒక ఎకరాకు రూ.60 వేల నుంచి 70 వేల వరకు ఖర్చు అవుతుంది. పెట్టుబడి పోగా దాదాపు రూ.40 వేల వరకు లాభాలు వస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలతో పంట కొంత దెబ్బతింది.
– భూపాల్‌రెడ్డి, రైతు
ప్రభుత్వం సహకరించాలి
పూల సాగుకు పెట్టుబడికి అప్పులు చేయాల్సి వస్తుంది. ప్రభుత్వం నారు ఉచితంగా పంపిణీ చేయాలి. మొక్కలపై సబ్సిడీ ఉండేలా అధికారులకు చర్యలు తీసుకుంటే రైతులకు మేలు చేకూరుతుంది. పూల రైతుల పట్ల సర్కారు అవగాహన కల్పిస్తూ ఆదుకోవాలి.
– సైపాల్‌రెడ్డి, అమ్డాపూర్, రైతు