
తుపాకీ విక్రయానికి పండ్ల వ్యాపారుల యత్నం
పట్టుకున్న సీసీఎస్ స్పెషల్ క్రైమ్ టీమ్
సాక్షి, సిటీబ్యూరో: ఝార్ఖండ్ నుంచి వలస వచ్చి నగరంలో పండ్ల వ్యాపారం చేస్తున్న ఓ వ్యక్తి తేలిగ్గా డబ్బు సంపాదించడానికి తుపాకీ విక్రయానికి యత్నించాడు. ఈ విషయంపై సమాచారం అందుకున్న సీసీఎస్ స్పెషల్ జోనల్ క్రైమ్ టీమ్ అతడితో పాటు మరొకరిని పట్టుకున్నట్లు అదనపు సీపీ (నేరాలు) ఎం.శ్రీనివాసులు బుధవారం వెల్లడించారు. ఝార్ఖండ్‌కు చెందిన విజయ్ యాదవ్ నగరానికి వలసవచ్చి లింగంపల్లిలో నివసిస్తున్నాడు. వివిధ బార్ అండ్ రెస్టారెంట్లు, వైన్ షాపుల వద్ద పండ్లు విక్రయిస్తూ జీవస్తున్నాడు. తేలిగ్గా డబ్బు సంపాదించాలని భావించిన ఇతగాడు నాటు తుపాకుల్ని తీసుకువచ్చి విక్రయించాలని భావించాడు. మూడు నెలల క్రితం బీహార్ వెళ్లి అక్కడి సోను కుమార్ నుంచి రూ.58 వేలకు 0.7 ఎంఎం క్యాలిబర్ నాటు పిస్టల్ ఖరీదు చేసుకువచ్చాడు. దీన్ని నగరంలోని అసాంఘిక శక్తులకు అమ్మడానికి సహకరించాల్సిందిగా సంతోష్‌నగర్‌లో ఉంటున్న తోటి పండ్ల వ్యాపారి బుంటి కుమార్ యాదవ్‌ను కోరారు. ఆ పిస్టల్ వీడియో తీసి ఇతడికి షేర్ చేసిన విజయ్ దాన్ని చూపిస్తూ ఎవరికై నా విక్రయించడానికి ప్రయత్నించాలని సూచించాడు. కొన్ని రోజులుగా ఇతగాడు ఆ అక్రమ ఆయుధం వీడియోను పలువురు రౌడీషీటర్లతో పాటు అసాంఘికశక్తులకు చూపిస్తూ అమ్మడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. దీనిపై సీసీఎస్ అధీనంలోని స్పెషల్ జోనల్ క్రైమ్ టీమ్‌కు సమాచారం అందింది. ఏసీపీ జి.వెంకటేశ్వర్‌రెడ్డి పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్ బి.బిక్షపతి నేతృత్వంలోని బృందం ఫలక్‌నుమా ప్రాంతంలో వలపన్ని బుంటి కుమార్‌ను పట్టుకుంది. అతడిచ్చిన సమాచారంతో విజయ్‌ను అదుపులోకి తీసుకుని అతడి నుంచి తుపాకీ, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని తదుపరి చర్యల నిమిత్తం ఫలక్‌నుమా పోలీసులకు అప్పగించింది.
మైలార్‌దేవ్‌పల్లి: విద్యుత్ షాక్‌కు గురై ఓ బాలుడు మృతి చెందిన సంఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ఈ ఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని మొగల్స్ కాలనీలో చోటు చేసుకుంది. వివరాలివీ... బిహార్‌కు చెందిన మహ్మద్ హర్షద్ బతుకుదెరువు కోసం తన కుటుంబ సభ్యులతో కలిసి మొగల్స్ కాలనీకి వచ్చి జీవనం సాగిస్తున్నారు. వీరు రేకుల ఇంట్లో ఉంటున్నారు. ఎడతెరపిలేని వర్షాల నేపథ్యంలో మంగళవారం రాత్రి ఇంట్లోకి వర్షపు నీరు వస్తున్నాయని వారి కుటుంబారు తౌపిక్(15) బ్యానర్‌ను తీసి ఇంటి రేకులపై కప్పేందుకు యత్నించాడు. ఈ సమయంలో బ్యానర్‌కు ఉన్న ఇనుప రాడ్‌కు కరెంటు ఉండటంతో విద్యుత్ ప్రమాదానికి గురయ్యాడు. విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించడంతో పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చరీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రాజేంద్రనగర్: ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సులను పెంచి మెరుగైన సేవలందించాల్సిన సమయంలో చార్జీలు పెంచడం ఏమిటని బీజేపీ రంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి వేముల మల్లేష్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆర్టీసీ నష్టాల్లో ఉన్నదనే సాకుతో రద్దు చేసిన సర్వీసులను పునరుద్ధరించాలన్నారు. శివరాంపల్లిలోని తన కార్యాలయంలో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు ఎన్నికల సమయంలో ఉచిత ఆర్టీసీ ప్రయాణ హమీని మహిళలకు ఇచ్చిందన్నారు. ఇచ్చిన హమీని ఒక పక్క నేరవేర్చుతూనే మరో పక్క రూట్ సర్వీసులను రద్దు చేసిందన్నారు. దీంతో నిత్యం ప్రయాణికులు, విద్యార్థులు, మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.