
వెక్కిరించిన ‘ఏకగ్రీవం’!
గ్రామాభివృద్ధికి ఉపయోగపడేవి..
పట్టించుకోలేదు
కొందుర్గు: పంచాయతీ ఎన్నికల వేళ ఆశావహుల మధ్య పోటాపోటీ సాగుతోంది. అప్పటివరకు మిత్రులుగా ఉన్న వారు రాజకీయ శత్రువులుగా, పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థితిలో ఉన్న వారు దోస్త్‌మేరా దోస్త్ అనేలా సమీకరణాలు మారిపోతున్నాయి. సాధారణ రోజుల్లో అంతా కలివిడిగా ఉండేవారు వేర్వేరు వర్గాలుగా విడిపోతున్నారు. ఊరిలో పరువు కోసం గెలిచి తీరాల్సిందేననే పట్టుదలను ప్రదర్శిస్తున్నారు. ఇందుకోసం ఎంత ఖర్చుకై నా వెనకడుగు వేసేది లేదని తెగేసి చెబుతున్నారు. ఓటర్లను తమవైపు తిప్పుకొనేందుకు విందులు ఏర్పాటు చేసి మాటామంతీ నిర్వహిస్తున్నారు. ప్రజల్లో తమకున్న ఆదరణ, బలాన్ని ప్రదర్శించేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఎన్నికల వేళ గ్రామాల్లో రోజూ పండగ వాతావరణమే కనిపిస్తోందంటే అతిశయోక్తి కాదు. ఆత్మీయ పలకరింపులు, వరుసలు కలుపుకొని కబుర్లు.. గెలుపోటములపై చర్చలూ ఇలా ఒక్కటేమిటి ఏ ఇద్దరు కలిసినా సర్పంచ్, వార్డు ఎన్నికల కోలాహలమే కనిపిస్తోంది. ఇంతటి సందడి ఉండే ఎన్నికలను ఏకగ్రీవం పేరుతో ఆదర్శంగా నిలిచిన గ్రామాలకు తగిన ప్రోత్సాహం అందించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. గతంలో ఏకగ్రీవంగా ఎన్నికై న పంచాయతీలకు రూ.50 వేల పురస్కారం అందించేవారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఈమొత్తాన్ని రూ.5 లక్షలకు పెంచారు. యునానిమస్‌గా ఎన్నికై న అన్ని జీపీలకు నిధులు విడుదల చేశారు. దీంతో ఆయా గ్రామాల్లో ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులు, వసతులను కల్పించారు. అనంతరం తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయతీలకు రూ.10 లక్షల నజరానా ప్రకటించింది. కానీ నిధులు మాత్రం విడుదల చేయలేదు.
జిల్లాలో 43 పంచాయతీలు
2019 ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా 43 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. ఎన్నికలు జరగకుండా సర్పంచ్‌తో పాటు వార్డు మెంబర్లందరినీ యునానిమస్‌గా ఎన్నుకుంటే తమ గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం నుంచి రూ.10 లక్షలు వస్తాయనే ఆశతో ప్రజలు ఈనిర్ణయం తీసుకున్నారు. కానీ మళ్లీ ఎన్నికలు వచ్చినా పురస్కారం డబ్బులు రాకపోవడంపై ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
కాంగ్రెస్ ఏం ప్రకటిస్తుందో..?
ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయతీలకు ఎలాంటి నజరానా ప్రకటిస్తుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. కానీ గత ప్రభుత్వం మాట తప్పిన నేపథ్యంలో ప్రజలు నమ్ముతారా.. లేదా అనేది వేచి చూడాల్సిందే.
గ్రామాభివృద్ధిని కాంక్షించి పంచాయతీలను ఏకగ్రీవం చేసిన గ్రామాలకు మొండిచేయే దక్కింది. ఎన్నికలు లేకుండా ఆదర్శంగా నిలిచిన జీపీలు పాలకుల వ్యవహారంతో అన్యాయానికి గురయ్యాయి. రూ.10 లక్షలు వస్తే ఊరిని అభివృద్ధి చేసుకుందామనుకున్న వీరి ఆశలు అడియాశలయ్యాయి.
యునానిమస్ పంచాయతీలకు మొండిచేయి
పదవీ కాలం పూర్తయినా దక్కని నజరానా
నిధుల విడుదలను పట్టించుకోని గత ప్రభుత్వం
పాలకుల హామీలపై ప్రజల్లో సన్నగిల్లిన విశ్వాసం
ఏకగ్రీవంగా ఎన్నికై న పంచాయతీలకు రూ.10 లక్షలు ఇస్తామని గత ప్రభుత్వం ప్రకటించడంతో మా గ్రామస్తులంతా ఏకమై వార్డు మెంబర్లతో పాటు సర్పంచ్‌గా నన్ను ఏకగ్రీవం చేశారు. మా పదవీ కాలం పూర్తయినా ఒక్కరూపాయి కూడా రాలేదు. ఆ డబ్బులు ఇస్తే గ్రామాభివృద్ధికి ఎంతో ఉపయోగపడేవి.
– నర్సింలు, మాజీ సర్పంచ్, లక్ష్మీదేవునిపల్లి, కొందుర్గు మండలం
బీఆర్‌ఎస్ ప్రభుత్వం పంచాయతీలను పట్టించుకోలేదు. నిధుల లేమితో పల్లెల అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోవడం వారికే నష్టం. కాంగ్రెస్ ప్రభుత్వమైనా ఏకగ్రీవ పంచాయతీలను ప్రోత్సహించాలి. ముందస్తుగా ప్రోత్సాహక మొత్తాన్ని ప్రకటించి, ఎన్నికలు పూర్తయిన మూడు నెలల్లోపు నిధులు విడుదల చేయాలి.
– భూపాలచారి, సర్పంచుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు