
ఎంపీని కలిసిన భూ బాధితులు
షాబాద్: తాతముత్తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూములు రేడియల్ రోడ్డులో పోతున్నాయని నాన్‌ధార్‌ఖాన్‌పేట్, మాచన్‌పల్లి రైతులు వాపోయారు. ఈ మేరకు బుధవారం చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. వందల ఏళ్లుగా ఇదే భూముల్లో వ్యవసాయం చేసుకుని బతుకుతున్నామని, ఇది తప్ప తమకు మరో ఆధారం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. దీనిపై స్పందించిన ఎంపీ రైతులకు తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల మాజీ అధ్యక్షుడు కిరణ్, ప్రధాన కార్యదర్శి పొన్న రాజీవ్‌రెడ్డి, నాయకులు కృష్ణచారి, అశోక్, కూతురు మహేందర్, జగదీష్‌గౌడ్ తదితరులు ఉన్నారు.
టీజీఐఐసీ బాధితులకు కలెక్టర్ హామీ
ఇబ్రహీంపట్నం రూరల్: ఎల్మినేడులో టీజీఐఐసీకి భూములు కోల్పోయిన రైతులకు పరిహారంతో పాటు ఇళ్ల స్థలాలు ఇస్తామని కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. భూ సేకరణ డిప్యూటీ కలెక్టర్ రాజు, ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంతరెడ్డి, టీజీఐఐసీ అధికారుల సమక్షంలో బుధవారం భూనిర్వాసితుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుల అభిప్రాయాలను సేకరించారు. పరిహారం పూర్తి స్థాయిలో ఇవ్వాలని బాధితులు కోరారు. పరిహారం తీసుకున్న వారి జాబితాలో కొంత మంది అనర్హులు ఉన్నట్లు తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఎల్మినేడులో వెంచర్ ఏర్పాటు చేసి పరిహారంతో పాటు ఇంటి స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో లీగల్ టీం సభ్యుడు శ్రావన్, ఎల్మినేడు భూ కమిటీ నాయకులు శ్రీకాంత్‌రెడ్డి, మహేందర్, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.