
పాఠశాలల అభివృద్ధికి సహకరించాలి
● జిల్లా విద్యాధికారి సుశీందర్‌రావు
● ఉర్దూ మీడియం స్కూల్‌లో తరగతి ప్రారంభం
శంకర్‌పల్లి: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి అవకాశం ఉన్న ప్రతిఒక్కరూ తమ సహకారాన్ని అందించాలని జిల్లా విద్యాధికారి సుశీందర్‌రావు కోరారు. పట్టణంలోని ఉర్దూ మీడియం పాఠశాలలో రూ.6 లక్షలతో కేఎన్‌ఏ ఫౌండేషన్ చేపట్టిన పనులను బుధవారం నార్సింగి ఏసీపీ రమణగౌడ్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం స్కూల్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో అధునాతన పరికరాలు, మౌలిక సదుపాయాల కల్పనకు మరిన్ని సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తన సొంత డబ్బులు వెచ్చించి టైల్స్, ఫెన్సింగ్, మోటార్ పైప్‌లైన్ తదితర పనులు చేయించిన పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నౌషిన్ సుల్తానాను అభినందించారు. ఈ కార్యక్రమంలో కేఎన్‌ఏ సంస్థ జనరల్ సెక్రెటరీ ఆస్మా నిక్కత్, తహసీల్దార్ సురేందర్, ఎంపీడీఓ వెంకయ్య, ఎంఈఓ అక్బర్, ఆదర్శ పాఠశాల, ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎంలు శోభారాణి, ఉదయశ్రీ, ఉపాధ్యాయుల తాహేర్‌అలీ తదితరులు పాల్గొన్నారు.