అడ్డగోలు నిర్మాణాలు! | - | Sakshi
Sakshi News home page

అడ్డగోలు నిర్మాణాలు!

Oct 8 2025 8:05 AM | Updated on Oct 8 2025 8:05 AM

అడ్డగోలు నిర్మాణాలు!

అడ్డగోలు నిర్మాణాలు!

సాక్షి, రంగారెడ్డిజిల్లా: పట్టణ ప్రణాళికా విభాగం దారి తప్పుతోంది. కళ్లముందే భారీగా అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నా, అనధికారిక సెల్లార్లు తవ్వుతున్నా.. కళ్లప్పగించి చూస్తుందే కానీ అడ్డుకునే ప్రయత్నం చేయడం లేదు. సరికదా పరోక్షంగా ఆయా అక్రమార్కులకు కొమ్ముకాస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. శివారు మున్సిపాలిటీల్లో అనుమతి లేని నిర్మాణాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. మణికొండ, నార్సింగి, బండ్లగూడజాగీర్‌, శంషాబాద్‌, బడంగ్‌పేట్‌, తుర్కయంజాల్‌, జల్‌పల్లి, పెద్ద అంబర్‌పేట్‌, తుక్కుగూడ, ఆదిబట్ల మున్సిపాలిటీల్లో అడ్డగోలు నిర్మాణాలు వెలుస్తున్నాయి. కనీస అనుమతులు లేకపోవడంతో పాటు 60 గజాల స్థలంలో ఆరు అంతస్తులు నిర్మిస్తున్నారు. కనీసం గాలి, వెలుతురు కూడా లేకుండా చేస్తున్నారు. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినప్పుడు హడావుడి చేస్తున్నారే కానీ.. తర్వాత వాటిని పట్టించుకోవడం లేదు. బేస్మెంట్‌ దశలోనే అడ్డుకోవాల్సింది పోయి.. తీరా స్లాబులు వేసి, గోడలు నిర్మించిన తర్వాత తనిఖీల పేరుతో టీపీఓ, అసిస్టెంట్‌ టీపీఓ, చైన్‌మెన్‌లు వచ్చి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇచ్చేందుకు నిరాకరిస్తే నిర్మాణాలను మధ్యలోనే కూల్చే ప్రమాదం ఉండటంతో భవన యజమానులు కూడా వారు అడిగినంత ఇచ్చి పంపుతున్నారు. ముఖ్యంగా 111 జీఓ పరిధిలోని శంషాబాద్‌ మున్సిపాలిటీలో భారీ సెల్లార్లు, భవంతులు వెలుస్తున్నాయి. ఈ అక్రమ నిర్మాణాలకు పరోక్షంగా రెవెన్యూ, టౌన్‌ప్లానింగ్‌, విద్యుత్‌ అధికారులు సైతం సహకరిస్తున్నట్లు ఆరోపణలు లేకపోలేదు. పాత వెంచర్లలో రోడ్లు, పార్కులు, విద్యా సంస్థలు, దేవాలయాల కోసం వదిలిన ఖాళీ స్థలాలను కబ్జా చేసి, గుట్టుగా నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ అంశంపై స్థానికులు సంబంధిత శాఖల అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు.

ఆ ఫిర్యాదుపై చర్యలు తీసుకోండి..

బడంగ్‌పేట్‌ మున్సిపాలిటీ పరిధిలో రోడ్డు ఆక్రమణకు సంబంధించి అమెరికన్‌ టౌన్‌షిప్‌ ప్లాట్‌ ఓనర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఇచ్చిన ఫిర్యాదుపై వెంటనే చర్యలు చేపట్టాలని కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. అనధికారిక ప్రతివాదులైన షేక్‌ సైఫుద్దీన్‌, ప్రైడ్‌ ఇండియా మాన్షన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌పై పోలీసుల సాయంతో చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఈ నెల 23కు వాయిదా వేసింది. బడంగ్‌పేట్‌ మున్సిపల్‌ పరిధిలోని రేణుకాపూర్‌ విలేజ్‌ సర్వే నంబర్‌ 354/4లోని అమెరికన్‌ టౌన్‌షిప్‌ లే అవుట్‌ ప్రకారం 40 ఫీట్ల రోడ్డు ఉండగా, మహ్మద్‌ సైఫుద్దీన్‌ రహదారిని కబ్జా చేశారని, చర్యలు తీసుకోవాలని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ అమెరికన్‌ టౌన్‌షిప్‌ ప్లాట్‌ ఓనర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ తరఫున అధ్యక్షుడితో పాటు మరొకరు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. మున్సిపాలిటీ తరఫున స్టాండింగ్‌ కౌన్సిల్‌ కృష్ణ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ల ఫిర్యాదు మేరకు చర్య తీసుకున్నామని చెప్పారు. అనధికారిక ప్రతివాదుల నిర్మాణాలు కూల్చివేశామన్నారు. వారు మళ్లీ నిర్మాణాలు కొనసాగిస్తున్నట్లు ఫిర్యాదు అందిందని, అవసరమైతే చర్యలు తీసుకుంటామని తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. పిటిషనర్ల ఫిర్యాదుపై వెంటనే చర్యలు తీసుకోవాలని, అవసరమైతే సంబంధిత పోలీస్‌ స్టేషన్‌ నుంచి సాయం పొందాలని కమిషనర్‌ను ఆదేశిస్తూ.. విచారణ వాయిదా వేశారు.

మున్సిపాలిటీల్లో ఇష్టారాజ్యం

రెచ్చిపోతున్న అక్రమార్కులు

పార్కుస్థలాలు, రోడ్లు యథేచ్ఛగా కబ్జా

పట్టించుకోని అధికారులు

కోర్టులను ఆశ్రయిస్తున్న బాధితులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement