
రైతులు సంఘటితం కావాలి
నవాబుపేట: పిల్లలపై తల్లిదండ్రులకు ఎంత మమకారం ఉంటుందో.. రైతులకు భూమిపై అంతకన్నా ఎక్కువ ఉంటుందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి అన్నారు. సోమవారం ట్రిపుల్ ఆర్ భూనిర్వాసితులను పోలీసులు ముందస్తు అరెస్టు చేసి వ్యక్తిగత పూచీకత్తుపై విడిచిపెట్టిన విషయం తెలిసిందే. వారిని మంగళవారం చిట్టిగిద్ద గ్రామంలో ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులు భూమిని నమ్ముకొని బతుకుతుంటే కాంగ్రెస్ అన్నదాతల భూములను అమ్ముకొని ప్రభుత్వాన్ని నడపాలని చూస్తోందని విమర్శించారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో రైతులకు మోసం జరుగుతుంటే స్పందించకపోవడం దారుణమన్నారు. ఈ విషయంలో సీఎం తలదించుకోవాలన్నారు. అభివృద్ధిని తాము వ్యతిరేకించడం లేదని, రైతులకు సరైన మేలు చేయాలన్నదే తమ ఉద్దేశం అన్నారు. ట్రిపుల్ ఆర్ బాధితులకు భూమికి బదులు భూమి.. లేదా మార్కెట్ విలువ ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులు సంఘటితమై పోరాడాలని పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్‌లో రైతులు తిరగ బడితేనే వారికి సరైన న్యాయం జరిగిందని గుర్తు చేశారు. అదే తరహాలో పోరాటం చేయాలని పిలపు నిచ్చారు. పేదలను ముంచి.. పెద్దలకు లాభం చేకూర్చాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం అలైన్‌మెంట్ మార్చిందని ఆరోపించారు. బాధిత రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు ఆనంద్, నాగేందర్‌గౌడ్, శుభప్రద పటేల్, ఆంజనేయులు, భరత్ రెడ్డి, దయాకర్ రెడ్డి, విజయ్ కుమార్, మాణిక్ రెడ్డి, కృష్ణారెడ్డి, శాంత కుమార్, నరేందర్ రెడ్డి, రాజు, పలువురు రైతులు తదితరులు పాల్గొన్నారు
కాంగ్రెస్ భూములమ్ముకొని బతకాలని చూస్తోంది
ముఖ్యమంత్రి సిగ్గుతో తలదించుకోవాలి
ట్రిపుల్ ఆర్ బాధితులకు బీఆర్‌ఎస్ అండగా ఉంటుంది
మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి