
పనిఒత్తిడే ప్రాణం తీసింది
● సీసీఐ ఎదుట మృతుడి కుటుంబ సభ్యుల ఆందోళన
● న్యాయం చేయాలని కార్మికులు, కాంగ్రెస్ నాయకుల డిమాండ్
● యాజమాన్యం హామీతో శాంతించిన నిరసనకారులు
తాండూరు రూరల్: బ్రెయి న్ స్ట్రోక్ గురై చికిత్స పొందుతున్న సీసీఐ కార్మికుడు ఆదివారం మృతిచెందాడు. దీంతో ఆగ్రహించిన బాధిత కుటుంబ సభ్యులు, తోటికార్మికులు, కాంగ్రెస్ నాయకులు సోమవారం మృతదేహంతో ఫ్యాక్టరీ ఎదుట ఆందోళన నిర్వహించారు. వీరు తెలిపిన వివరాల ప్రకారం.. కరన్‌కోట్‌కు చెందిన మర్పల్లి ఖాజామియా(45) సీసీఐ ఫ్యాక్టరీ ప్యాకింగ్ ప్లాంట్‌లో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్నాడు. గత గురువారం రాత్రి పనికి వెళ్లగా ప్యాకింగ్ పనులకు బదులు ప్లాంట్‌లో నిలిచిన వరద నీటిని బకెట్లతో ఎత్తి బయటపోయాలని కాంట్రాక్టర్ ఆదేశించాడు. రాత్రి వేళ చల్లని గాలి వీస్తుండగా సుమారు ఆరు గంటల పాటు నీళ్లలో ఉండటంతో అనారోగ్యానికి గురై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే కార్మికులు అతన్ని తాండూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని హైదరాబాద్ తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. ఇందుకోసం కంపెనీ అంబులెన్స్ ఇవ్వాలని కోరినా యాజమాన్యం పట్టించుకోలేదని కార్మికులు ఆరోపించారు. దీంతో ప్రైవేటు అంబులెన్స్‌లో నగరానికి తీసుకెళ్లారు. ఖాజామియా జీతం నుంచి ప్రతినెలా ఈఎస్‌ఐ కోసం డబ్బులు కట్ అవుతున్నా కార్డు పనిచేయలేదు. ఈఎస్‌ఐలో నగదు జమకావడం లేదని చెప్పడంతో అక్కడి నుంచి గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో ఆదివారం మృతిచెందాడు.
మృతదేహంతో ఆందోళన
కాంట్రాక్టర్ పని ఒత్తిడి కారణంగానే ఖాజామియా మృతిచెందాడని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. మృతదేహంతో వెళ్లి ఫ్యాక్టరీ గేటు ఎదుట బైఠాయించారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు శరణు బసప్ప, రాజ్‌కుమార్, భరత్‌కిషోర్, అనిల్, జర్నప్ప వీరికి మద్దతు తెలిపారు. అంబులెన్స్ ఇవ్వకపోడం, ఈఎస్‌ఐలో నగదు జమ చేయకపోవడంపై కంపెనీ ప్రతినిధులతో వాగ్వాదానికి దిగారు. ఏఎస్‌ఐ పవన్‌కుమార్ సిబ్బందితో వెళ్లి ఆందోళనకారులతో మాట్లాడారు. మృతుడి కుటుంబానికి అత్యవసరంగా రూ.75 వేల నగదు, రూ.7 లక్షల ఇన్సూరెన్స్‌తో పాటు కుటుంబంలో ఒకరికి కాంట్రాక్ట్ ఉద్యోగం ఇస్తామని యాజమాన్యం హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

పనిఒత్తిడే ప్రాణం తీసింది