
బంగారానికి మెరుగు పెడతామని..
● నిందితులకు దేహశుద్ధి చేసిన గ్రామస్తులు
షాద్‌నగర్‌రూరల్: బంగారానికి మెరుగు పెడుతామంటూ ఇద్దరు దుండగులు ఓ వృద్ధురాలిని బురిడీ కొట్టించారు. మత్తు మందు చల్లి ఆమె వద్ద ఉన్న బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. గ్రామస్తులు వారిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన మండల పరిధిలోని వెలిజర్లలో సోమవారం చోటు చేసుకుంది. సీఐ విజయ్‌కుమార్, గ్రామస్తులు తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన వృద్ధురాలు బ్యాగరి చిన్నమ్మ ఇంటికి సోమవారం ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు. బంగారం, వెండి ఆభరణాలకు మెరుగుపెడుతాం అంటూ నమ్మించారు. దీంతో ఆమె తన వెండి కడియాలను ఇవ్వడంతో శుభ్రం చేసి ఇచ్చారు. అనంతరం మెడలో ఉన్న తులంన్నర బంగారు గుండ్ల హారాన్ని ఇచ్చింది. నిందితులు స్టవ్‌పై గిన్నె ఉంచి నీళ్లు, పసుపు వేసి అందులో బంగారు దండ వేసినట్లు నటించారు. దండ తెల్లగా అయ్యిందని దాన్ని టిఫిన్ బాక్స్‌లో పెట్టామని వృద్ధురాలికి చెప్పారు. అంతలోనే ఆమైపె మత్తు మందు చల్లి నగలతో ఉడాయించారు.
తేరుకున్న వృద్ధురాలు
కాసేపటికి తేరుకున్న వృద్ధురాలు చిన్నమ్మ విషయాన్ని చుట్టు పక్కల వారికి చెప్పింది. దీంతో గ్రామస్తులు అప్రమత్తమై గ్రామంలోకి కొత్తగా వచ్చిన వారిని గుర్తించే పనిలో పడ్డారు. గ్రామంలోని ఓ టీకొట్టు వద్ద ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఉన్నట్లు గుర్తించారు. వారిని గ్రామ పంచాయతీ వద్దకు తీసుకువచ్చి దేహశుద్ధి చేయడంతో చోరీ చేసినట్లు అంగీకరించారు. వారి వద్ద నుంచి బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు నిందితులను ఠాణాకు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.
మత్తుమందు చల్లి వృద్ధురాలి నగలు దోచుకెళ్లిన దుండగులు