
రైతుల ముందస్తు అరెస్ట్
నవాబుపేట: ట్రిపుల్‌ఆర్ కొత్త అలైన్‌మెంట్‌కు నిరసనగా ధర్నాకు సిద్ధమైన రైతులను పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం మండలంలోని చించల్‌పేట, చిట్టిగిద్ద గ్రామాలకు చెందిన భూ నిర్వాసితులు నగరంలోని హెచ్‌ఎండీఏ కార్యాలయం వద్ద ధర్నాకు సిద్ధమయ్యారు. దీంతో పోలీసులు వారిని ముందస్తు అరెస్టు చేసి నవాబుపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్ నాయకులు స్టేషన్‌కు చేరుకొని రైతులకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వమని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ రైతులను అరెస్టు చేయడం ఏమిటని నిలదీశారు. బాధితులకు బీఆర్‌ఎస్ అండగా ఉంటుందన్నారు. త్వరలో సీఎం ఇంటిని ముట్టడిస్తామన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు. మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి ఎస్సీ నారాయణరెడ్డితో ఫోన్‌లో మాట్లాడి వెంటనే రైతులను విడుదల చేయాలని కోరినట్లు తెలిసింది. అనంతరం రైతులను విడిచిపెట్టారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు ఆనంద్, నాగేందర్‌గౌడ్, భరత్‌రెడ్డి, విజయ్‌కుమార్, పురుషోత్తం, కృష్ణారెడ్డి, శాంతకుమార్ తదితరులు పాల్గొన్నారు.