
మురుగుమయంగా కోఠి ఈఎన్‌టీ..!
ఆసుపత్రి ఆవరణలో పొంగిపొర్లుతున్న వైనం
సుల్తాన్‌బజార్: కోఠి ఈఎన్‌టీ ఆసుపత్రి మురుగుమయంగా మారింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మురుగునీరు చేరడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం 1000 మంది వరకు అవుట్ పేషెంట్ రోగులు వైద్య సేవలు పొందుతుంటారు. అయితే ఆసుపత్రిలోని క్యూలైన్ వద్ద, ఆసుపత్రి క్యాంటీన్ వద్ద మురుగు నీరు రోజుల తరబడి నిల్వ ఉంటున్నది. ప్రభుత్వం పంపిణీ చేసే ఆహారం సైతం మురుగునీటిలోనే రోగులకు అందజేస్తుండడంతో దుర్వాసనతో రోగులు ఇక్కట్లకు గురవుతున్నారు. వారం రోజులుగా ఆసుపత్రిలో మురుగు నీరు ప్రవహిస్తుండడంతో ఆసుపత్రి ప్రాంగణం మొత్తం మూసీ నదిని తలపిస్తోంది.
రోగులకు తప్పని తిప్పలు...
కోఠి ఈఎన్‌టీ ఆసుపత్రిలో ఎటు చూసినా మురుగునీరు ప్రవహిస్తుండడంతో ఆసుపత్రికి వచ్చే ప్రజలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రోగం నయం చేసుకునేందుకు వచ్చే రోగులు కొత్త వ్యాధులు సోకుతున్నాయని వారు ఆందోళన చెందుతున్నారు. వైద్యులు సైతం దుర్వాసన భరించలేక మాస్క్‌లు పెట్టుకుని చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం డీఎంఈ దృష్టికి వెళ్లడంతో ఆయన ఆసుపత్రిని సందర్శించి మురుగునీటి సమస్యను పరిష్కరించాలని చెప్పినా ఆసుపత్రి, జీహెచ్‌ఎంసీ అధికారులు పట్టించుకోకుండా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి ఈఎన్‌టీ ఆసుపత్రిలో మురుగునీటి సమస్యను పరిష్కరించాలని రోగులు కోరుతున్నారు.